Tuesday, November 26, 2024

రమ్య కుటుంబానికి సర్కార్ భరోసా.. ఇళ్ల పట్టా అందించిన హోంమంత్రి

గుంటూరు జిల్లాలో

 ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను
హోంమంత్రి సుచరిత, ఎంపి నందిగం సురేష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్థఫా, మద్దాలి గిరి, మేరుగ నాగార్జున పరామర్శించారు. రమ్య కుటుంబ సభ్యులకు హోంమంత్రి  సుచరిత ఇళ్ళ పట్టాను అందజేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు రమ్య కుటుంబానికి అండగా ఉంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం అన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా హోం మంత్రి సుచరిత చెప్పారు. మౌనికకు ఉద్యోగం ఇస్తామని తెలిపారు. రమ్య మృగాడి చేతిలో బలైందన్నారు. ఈ కేసులో నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేశామని హోంమంత్రి గుర్తు చేశారు. సోషల్ మీడియాలో పరిచయాలపై మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రమ్య నిందితుడు గురించి తల్లిదండ్రులకు ముందే చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేదని కాదని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతే దిశ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకొని ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ విషయంలో విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని హోం మంత్రి పేర్కొన్నారు.

బాధిత కుటుంబానికి ఇవ్వాల్సినవన్ని ఇవ్వాలని సీఎం వ్యక్తిగత శ్రద్ద తీసుకొని పర్యవేక్షిస్తున్నారని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున తెలిపారు. ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలు, నేతలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. బాధ్యతగా ఉండాల్సిన ప్రతిపక్షం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 

- Advertisement -

సీఎం సొంత కుటుంబ సభ్యుల్లా తమను చూస్తున్నారని రమ్య కుటుంబ సభ్యులే చెప్పారని ఎంపి నందిగం సురేష్ అన్నారు. సమాజంలో జనాలు సామాజిక బాధ్యత మరిచిపోయారని, సృహ కోల్పోయారని అన్నారు. నిందితుడు బక్క పల్చగా ఉన్నాడని..చోద్యం చూసిన వాళ్ళంతా బాధ్యత వహించాలని హితవుపలికారు. ప్రభుత్వం చేయాల్సింది చేస్తుందని తెలిపారు. రమ్య వైపు తప్పు లేకపోయిన హత్య చేశాడన్నారు. సోషల్ మీడియా  వలన లాభాలు కంటే నష్టాలే ఎక్కువని…అవసరం ఉంటేనే ఫోన్ వాడుకోవాలని సూచించారు. కొంతమంది శవ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement