Tuesday, October 29, 2024

AP |డిప్యూటీ సీఎం పవన్‌తో హోంమంత్రి అనిత భేటీ !

అమరావతి, ఆంధ్రప్రభ : పర్యావరణహిత టపాకాయలకు పెద్దపీట వేస్తూ దీపావళి జరుపుకోవాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి కార్యాలయంలో హోంమంత్రి అనిత పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. సమావేశంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, దీపావళి నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లపై చర్చించారు.

185 అగ్నిమాపక స్టేషన్లు, సిబ్బంది ఎక్కడ ప్రమాదం జరిగినా అప్రమత్తంగా ఉండేలా ఆదేశాలిచ్చినట్లు హోంమంత్రి డిప్యూటీ సీఎంకు వెల్లడించారు. 100 లేదా 101 నంబర్లకు ఫోన్‌లు చేసి టపాకాయల అక్రమ తయారీపై పోలీస్‌, ఫైర్‌ వ్యవస్థలకు ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

డ్రగ్స్‌, గంజాయి, సైబర్‌ నేరాల పట్ల గతంలో లేని విధంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు హోంమంత్రి వెల్లడించారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియాకు సంబంధించి తాజా పరిస్థితులపై ఆరా తీశారు. ప్రస్తుతం డయేరియా కేసుల నమోదు తగ్గిందని పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు హోంమంత్రి వివరించారు.

పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను ఉపముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామం తరహా దీపావళి టపాకాయల పేలుడు ఘటనలు జరగకుండా మరింత అప్రమత్తంగా ఉండాల డిప్యూటీ సీఎం సూచించారు.

వాయు కాలుష్యం దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలో దీనిపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకటించిన దియాజలావ్‌ కార్యక్రమం తరహాలో ఏపీలోనూ ప్రజలకు అవగాహన కల్పించాలన్న పవన్‌ కల్యాణ్‌ సూచించారు. ఇటీవల రాష్ట్రంలో విమానాలలో బాంబు బెదిరింపులపైనా హోంమంత్రిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.

- Advertisement -

వైఎస్‌ఆర్సీపీ హయాంలో జరిగిన రాష్ట్రంలోని అరాచక పరిస్థితులు ఇటీవల బయటికి వస్తున్న దుర్మార్గాలపై చట్టప్రకారం వేగంగా దర్యాప్తు చేసి, నిందితులను శిక్షించేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నిర్వహణను డిప్యూటీ- సీఎం ప్రశంసించారు.

నేరాల నియంత్రణలో మొబైల్‌ ఫోన్‌ వినియోగించాలని హోంమంత్రి ప్రజల భాగస్వామ్యం కోరడాన్ని అభినందించారు. అనంతరం అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో లింగాపురం నుంచి కొడవటిపూడి కట్ట వరకు సుమారు కి.మీ మేర నిర్మించనున్న ఆర్‌ అండ్‌ బీ రోడ్డుకు అటవీ శాఖ అనుమతులు ఇప్పించాలని హోంమంత్రి అనిత పవన్‌ కల్యాణ్‌ను కోరారు.

పాయకరావుపేటలోని వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పూర్తికి చొరవ చూపాలని వినతి పత్రం అందజేశారు. తన నియోజకవర్గంలోని పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం సహా ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రాధాన్యతను పవన్‌ కళ్యాణ్‌కు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement