Monday, November 25, 2024

AP – ఆ ఘ‌ట‌న‌లు అత్యంత హేయం, దారుణం – హోం మంత్రి అనిత

అంధ్రప్రభ స్మార్ట్ – అమరావతి – నంద్యాల జిల్లా ముచ్చుమర్రి, విజయనగరంలో జరిగిన ఘటనలు అత్యంత హేయం, దారుణమని హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. విజయనగరంలో మైకంలో తాత వరుస వ్యక్తి చిన్నారిపై అత్యాచారం చేశాడని.. ముచ్చుమర్రిలో బాలికను హత్య చేసి రాయి కట్టి మరీ రిజర్వాయర్లోకి తోసేశారని ఆమె తెలిపారు. ఈ ఘటనల్లో బాధిత బాలిక కుటుంబానికి ఏపీ ప్రభుత్వం నుంచి రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని హోం మంత్రి అనిత తెలిపారు. 

అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు, గంజాయి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారని పేర్కొన్నారు. మద్యం, గంజాయి, డ్రగ్స్ మత్తులో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని.. ఈ రెండు అంశాలపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరపాలని సీఎం ఆదేశించారన్నారు. మచ్చుమర్రి ఘటనలో మైనర్లు ఉన్నారని మంత్రి చెప్పారు. ఫోన్లలో అశ్లీల వెబ్ సైట్లు అందుబాటులోకి వస్తుండటమూ ఈ తరహా ఘటనలకు కారణం అవుతోందన్నారు. క్రిమినల్‌కు పార్టీ, క్యాస్ట్ ఉండదు.. వారికి శిక్ష పడాల్సిందేనని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.

- Advertisement -

ముచ్చుమర్రి ఘటన

నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పీఎస్‌ పరిధిలోని ఎల్లాల గ్రామానికి 8 ఏళ్ల బాలికపై మైనర్‌ బాలురు అత్యాచారం చేశారు. 14 ఏళ్ల నుంచి 16 ఏళ్ల లోపు వయసున్న ముగ్గురు ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి ఇంట్లో చెబుతుందనే భయంతో హత్య చేసి.. మృతదేహాన్ని రిజర్వాయర్‌లో పడేశారు. తొమ్మిది రోజుల దాటినా ఆ బాలిక మృత‌దేహం ల‌భించ‌లేదు.. అన్వేష‌ణ ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న‌ది.

విజయనగరంలో దారుణ ఘటన

విజయనగరం జిల్లా బొబ్బిలిలోని రామభద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 5 నెలల చిన్నారిపై మద్యం మత్తులో ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉయ్యాలలో నిద్రపోతున్న చిన్నారిపై తాత వరసైన వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. చిన్నారిని తల్లి ఉయ్యాలలో పడుకోబెట్టి స్థానిక కిరాణా దుకాణానికి వెళ్లింది. కొద్దిసేపటికి నార్లవలస గ్రామానికి చెందిన బి.ఎరుకన్న దొర ఇంట్లోకి ప్రవేశించి చిన్నారి లైంగిక దాడి చేశాడు. చిన్నారి బిగ్గరగా ఏడవడంతో అక్కాచెల్లెళ్లు ఇంట్లోకి వచ్చారు. జరిగిన ఘటనను వారు తల్లికి చెప్పారు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ ఘ‌ట‌న‌పై సైతం మంత్రి అనిత స్పందించారు. విజయనగరంలో ఊయలలో ఉన్న ఆరు నెలల పసికందుపై అత్యాచారం చేయడం దారుణమన్నారు. ఈ ఘటనలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారని… లిక్కర్, డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపాలని సీఎం చెప్పారని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అమ్మాయిలపై అఘాయిత్యాలు జరిగితే నిందితుల్ని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. ఆ చిన్నారి కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement