Wednesday, September 18, 2024

AP బీచ్‌ సిటీలో రోజుకో టెన్ష‌న్‌ … స్టీల్ సిటీకి ఏమైంది?


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, విశాఖ‌ప‌ట్నం : ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న విశాఖ నగరం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. ఒకపక్క వరుస చోరీలు అదే స్థాయిలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే నగరంలో ప్రధాన హాస్పిట‌ళ్ల‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెంకోజి పాలెం వద్ద ఉన్న‌ మెడికవర్ ఆస్ప‌త్రిలో అగ్ని ప్రమాదం మరువకముందే.. రెండు రోజుల క్రితం రామ్ నగర్‌లోని 7 హిల్స్ ఆస్ప‌త్రిలో కూడా అగ్నికీలలు ఎగసిపడ్డాయి పడ్డాయి. అయితే.. ప్రాణ నష్టం జరిగ‌నప్పటికీ ఆస్తి నష్టం మాత్రం లక్షల్లో ఉంది. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక.. బీచ్ రోడ్డులో ఉన్న డైనో పార్కులో మంగ‌ళ‌వారం ఉద‌యం రెస్టో కేఫ్‌లో చెల‌రేగిన మంట‌ల‌తో రెస్టారెంట్ పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

అలుముకున్న పొగ‌..

- Advertisement -

భారీ అగ్నికీలల కారణంగా డైనో పార్క్ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిప్రమాదంతో సమీప ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెదురు బొంగులు, ఇతర కలప నిర్మించిన పార్క్ కావడంతో మంటలను అదుపు చేయడం సవాల్‌గా మారింది. ఈ ప్ర‌మాదంతో ఎవ‌రికీ గాయాలు కాక‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదాలకి సిబ్బంది నిర్లక్ష్యమా? నిర్మాణంలో ముందస్తు చర్యలు చేపట్టకపోవడం అనే అంశాలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఈ రెండు ప్రమాదాల్లో రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకపోవడం కొంత ఉపశమనమే. తరచూ ఇలా నగరంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంపై స్థానికులు భయభ్రాంతులకు లోనవుతున్నారు.

వరుస చోరీలు

నగరంలో వరుస చోరీలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇల్లు వదిలి వెళ్ల‌డానికి భయపడుతున్నారు. విజయవాడ మధురవాడ సమీపంలోని పనోరమ అపార్ట్మెంట్లో భారీ చోరీ జరిగింది. అయితే.. ఈ చోరీ చెడ్డీ గ్యాంగ్ పనేనంటూ వార్తలు వస్తున్నాయి. ఎక్కువ మొత్తంలో బంగారం నగదు చోరీ జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులతోపాటు డాగ్ స్వ్కాడ్‌తో సెర్చ్ చేశారు.

ఆల‌యాల్లోనూ..
ఇక‌.. విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ కేసు ఇంకా విచారణ కొన‌సాగుతోంది. ఇంతలోనే సోమవారం రాత్రి మాధవధార సమీపంలోని మాధవస్వామి ఆలయంలో భారీ చోరీ చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆలయంలోని విలువైన వస్తువులు.. బంగారం చోరీ జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ చేపట్టారు. ఇక‌.. ఎప్పుడు ఏ ప్రాంతంలో చోరీ జరుగుతుంది అని స్థానికుల ఆందోళన చెందుతున్నారు. నగరంలో రాత్రి గస్తీ ముమ్మరం చేయాల్సిన అవసరం కూడా ఉందని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement