ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనపై నమోదైన 11 కేసుల విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. గతంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై దురుసుగా ప్రవర్తించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తదితర అభియోగాలతో జగన్ పై దాదాపు 11 కేసులను నమోదు చేశారు. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయితే, కేసుల ఉపసంహరణను సుమోటోగా తీసుకున్న హైకోర్టు బుధవారం విచారణ ప్రారంభించింది.
విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలను వినిపించారు. న్యాయపరమైన చర్యలను పరిపాలన విధానాల ద్వారా తీసుకోవడం న్యాయ విరుద్ధమని ఏజీ అన్నారు. ఈ కేసులకు సంబంధించి కోర్టుకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. ఈ కేసుకు విచారణ అర్హత ఉందో, లేదో నిర్ధారించాలని కోరారు. ఏజీ వాదనలను విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. కాగా, 11 కేసుల ఎత్తివేత నిబంధనల ప్రకారమే జరిగిందా? ఇందులో లోటుపాట్లు ఉన్నాయా? అనే విషయాన్ని హైకోర్టు తేల్చనుంది.
ఇదీ కూడా చదవండి: చిరుకి ధన్యవాదాలు చెప్పిన సీఎం జగన్..