ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై ఇవాళ ఏపీ హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో గతంలో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. పోలింగ్ తేదీకి 4వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలన్న సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందంటూ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించాయి. దానిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి .. ఏప్రిల్ 8న జరగే ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ ఏప్రిల్ 6 న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
అయితే, దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పీల్ దాఖలు చేయగా ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి…లెక్కింపు ప్రక్రియ నిలుపుదల చేసింది. దీనిపై లోతుగా విచారణ జరపాల్సిందిగా సింగిల్ జడ్జికి హైకోర్టు అప్పగించింది. దీంతోపాటు జనసేన, బీజేపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపైనా సింగిల్ జడ్జి ఈనెల 4 న విచారణ జరిపి తీర్పును రిజర్వు చేశారు.
ఆంధ్రప్రదేశ్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 8న జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 652 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీలకు ఎన్నిక జరిగింది. పోటీకి దూరమైన టీడీపీ పట్టు ఉన్న చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు కొందరు బరిలో నిలిచారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 660 జడ్పీటీసీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 126 ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాలతో 8 స్థానాలకు ఎన్నికలు జరగడంలేదు. గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు పోటీలో ఉన్న 11మంది అభ్యర్థులు మరణించారు. మిగిలిన 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 10,047 ఎంపీటీసీలకు గాను 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 375 స్థానాలకు వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించడం లేదు. 81 మంది అభ్యర్థులు మరణించడంతో మిగిలిన 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 18,782 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఇదీ చదవండి: టీకాల సంపదతో కొత్తగా కుబేరులైన తొమ్మిది మంది..