Sunday, November 3, 2024

సుప్రీం మార్గదర్శకాల్ని ఉల్లంఘించారు: పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

రాజధాని ప్రాంత ఎస్సీ రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు, మంగళగిరి అదనపు జూనియర్ సివిల్ జడ్జి, గుంటూరు రెండో అదనపు జిల్లా జడ్జి ఉల్లంఘించారని తీవ్రంగా ఆక్షేపించింది. వారిపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ లలిత… గతంలో ఇచ్చిన ఉత్తర్వులు తాజాగా వెలుగుచూశాయి.

రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ఎస్సీ రైతులపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు వ్యవహారంపై… హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. అర్నేష్ కుమార్ కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలను పోలీసులు, న్యాయాధికారులు ఉల్లంఘించారని… వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, సీఆర్పీసీ-41A నిబంధనలు పాటించని గుంటూరు అర్బన్ డీఎస్పీ డి.దుర్గాప్రసాద్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని గుంటూరు ఎస్పీని ఆదేశించింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ కోర్టు ఉత్తర్వులు అందిన 8 వారాల్లో హైకోర్టుకు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

అలాగే మంగళగిరి అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి.పి.ఎన్.వి లక్ష్మి, గుంటూరు రెండో అదనపు జిల్లా జడ్జి ఎ. వాసంతిపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించేదుకు.. తీర్పు ప్రతిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద ఉంచాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. జీవితాన్ని కాపాడుకునేందుకు, స్వేచ్ఛ, హక్కులను రక్షించుకునేందుకు పౌరులు కోర్టుల వైపు చూస్తుంటారని.. నిబంధనలను పాటించకుండా ఆ హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదని విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత అన్నారు. న్యాయాధికారులు యాంత్రికంగా వ్యవహరించారనేందుకు, పోలీసులు విచ్చలవిడి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనడానికి ఇదో ప్రామాణిక కేసు అని వ్యాఖ్యానించారు. ఈ కేసు వ్యవహార తీవ్రత, దర్యాప్తు సందర్భంగా ఎలాంటి క్రమ రాహిత్యానికి పాల్పడ్డారో… మంగళగిరి మేజిస్ట్రేట్, గుంటూరు రెండో ఏడీజే అర్థం చేసుకోలేదనే విషయం వారు సమర్పించిన నివేదికలను పరిశీలించాక అర్థమైందని జస్టిస్ లలిత అన్నారు.

రిమాండ్ రిపోర్టు తమ ముందు ఉంచినప్పుడు… కళ్లు మూసుకోవడానికి వీల్లేదన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును.. ఉన్నది ఉన్నట్లుగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ కేసు విషయంలో న్యాయాధికారులు, దర్యాప్తు అధికారి.. చట్టబద్ధ పాలనను చాలా సహజంగా తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నిందితులను ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు రిమాండుకు పంపారనే అంశంపై… పోలీసు అధికారి, న్యాయాధికారులు సమర్పించిన నివేదికల్లో పేర్కొన్న కారణాలు కోర్టును సంతృప్తిపరిచేవిగా లేవన్నారు. దర్యాప్తు అధికారి తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ఎస్.ఎస్. ప్రసాద్.. సీఆర్పీసీ నిబంధనలకు అనుగుణంగా కేసు నమోదు చేశామన్నారని న్యాయమూర్తి తీర్పులో గుర్తుచేశారు.

బెయిల్ పిటిషన్‌పై విచారణ చేసినప్పుడు మంజూరు చేయడం తప్ప మరే ఇతర అధికారాలను కోర్టు ఉపయోగించడానికి వీల్లేదన్నారని… ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి ఎందుకు రిమాండుకు పంపారనే విషయంపై ఒక్క కారణాన్నీ చెప్పలేకపోయారని అన్నారు. ఈ తరహా అధర్మ ఘటనలు చోటుచేసుకున్నప్పుడు కూడా కోర్టు మౌన ప్రేక్షకుడిగా ఉండిపోవాలంటూ సీనియర్ న్యాయవాది చేసిన వాదనలు ప్రశంసించేవిగా లేవన్నారు. మూడు రాజధానులకు అనుకూలంగా 2020 అక్టోబర్ 23న తాళ్లాయపాలెంలో కార్యక్రమానికి వెళుతున్న వారిపై దాడికి పాల్పడి, కులం పేరుతో దూషించారంటూ… అమరావతి రైతులపై ఐపీసీ, ఎస్సీ-ఎస్టీ చట్టం కింద మంగళగిరి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టబోర్‌ 24వ తేదీన అరెస్ట్ చేశారు. అయిదుగురు ఎస్సీలపై అప్పట్లో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం విమర్శలకు తావిచ్చింది.

- Advertisement -

ఆ అయిదుగురితోపాటు మరో ఇద్దరు నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను… గుంటూరు రెండో అదనపు జిల్లా జడ్జి కోర్టు కొట్టేసింది. దీనిపై రైతులు కుక్కమళ్ల అమర్‌బాబు, నంబూరు రామారావు, ఈపూరి రవికాంత్, ఈపూరి సందీప్, ఈపూరి కిశోర్, సాంటి నరేశ్, దానబోయిన బాజీ… అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరపున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు విపించారు. కులదూషణ జరగలేదని ఫిర్యాదుదారే ఒప్పుకున్నారన్నారని.. ఎస్సీలపైనే ఎస్సీ-ఎస్టీ కేసు నమోదు చేశారని వివరించారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. 2020 నవంబర్ 11న వారికి బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకెక్కడిదని నిలదీసింది. ఎస్సీలని తెలిసీ ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement