Tuesday, November 26, 2024

అమూల్ కేసు: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

గుజరాత్ కు చెందిన అమూల్‌తో కుదుర్చుకున్న ఎంవోయూపై ఎలాంటి నిధులు వెచ్చించొద్దని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అమూల్‌, నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. అమూల్‌తో ప్రభుత్వ ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ వేశారు. ఏపీడీడీఎఫ్ ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ సీఎం జగన్ అధ్యక్షత కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో రఘురామ సవాల్ చేశారు.

ఈ నిర్ణయాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించి, రద్దు చేయాలని పిటిషన్ లో కోరారు. రఘురామ తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఆది నారాయణరావు వాదనలు వినిపించారు. వాదనల అనంతరం నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు.. గుజరాత్‌లోని అమూల్‌కి నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. అమూల్‌తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంపై.. ఎలాంటి నిధులు ఖర్చు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 14వ తేదీకి కేసు విచారణను హైకోర్టు వాయిదా వేస్టున్నట్లు ప్రకటించింది.

కాగా, ఏపీ అమూల్‌ ప్రాజెక్ట్‌ను శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాకు విస్తరించారు. పశ్చిమ గోదావారి జిల్లాలో పాల సేకరణ నిర్వహించే కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటికే వైఎస్ఆర్ కడప జిల్లా, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాల సేకరణ నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement