సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ల ధరల అంశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.35ను హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌కు ఏపీ ప్రభుత్వం వెళ్లింది. సినిమా టికెట్ల ధరలపై ఏపీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. జీవో 35ను సస్పెండ్ చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం స్టే కోరింది. సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు థియేటర్ యజమానులు టికెట్ ధరల ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ ముందు ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. టికెట్ ధరలపై జేసీ నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. కోర్టు గత ఆదేశాలకు అనుగుణంగా టికెట్ ధరల నిర్ణయంలో ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
సామాన్య ప్రజల ప్రయోజనం రీత్యా ఏపీలో సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం ఇటీవల భారీగా తగ్గించింది. ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకం విధానం తీసుకువచ్చింది. దీనికి సంబంధించి జీవో నెం.35 జారీ చేసింది. అయితే ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డిస్టిబ్యూటర్లు, సినిమా థియేటర్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లను విచారించిన హైకోర్టు.. థియేటర్లలో టికెట్ల ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదన్న థియేటర్ల యాజమాన్యాల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. పాత పద్ధతిలోనే టికెట్ల రేట్లు పెంచుకోవచ్చంటూ ఈ నెల 14న ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ జీవోను హైకోర్టు నిలుపుదల చేసింది.