Sunday, November 17, 2024

జగన్ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురు

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాజధాని అమరావతిలో అసైన్డ్ రైతుల వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. రాజధానిలో అసైన్డ్ రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు వెనక్కి తీసుకుంటూ.. జారీ చేసిన జీవో-316పై తదనంతర చర్యలను హైకోర్టు నిలిపివేసింది. అసైన్డ్ రైతులకు ఇచ్చిన ప్లాట్లను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను రాజధాని రైతులు హైకోర్టులో సవాల్ చేశారు.

రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వం.. 29 గ్రామాల రైతుల నుంచి భూములు తీసుకుందని.. చుట్టూ వందల ఎకరాలు సమీకరించాక.. మెరుగైన ప్యాకేజీ ఇస్తూ జీవో నంబర్ 41 జారీ చేశారని రైతులు తరుఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఆ జీవో చెల్లదంటూ 316 నంబర్ జీవో తీసుకురావడమే కాక నోటీలు ఇచ్చారని చెప్పారు. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. జీవో నంబర్ 316పై తదుపరి చర్యలు చేపట్టొద్దని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement