Tuesday, November 26, 2024

ఆనందయ్య మందు పంపిణీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

ఆనందయ్య మందు పంపిణీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో హైకోర్టు సైతం అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణ వచ్చే గురువారానికి హైకోర్టు వాయిదా వేసింది. మందుపై గురువారంలోపు పూర్తి నివేదిక ఇవ్వాలి హైకోర్టు ఆదేశించింది.

ఆనందయ్య ఔషధం పంపిణీపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. మధ్యాహ్నం 1 గంట సమయానికి వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మధ్యాహ్నం 3 గంటల సమయానికి వాయిదా వేసింది. కోర్టులో విచారణ పునఃప్రారంభమైన అనంతరం, ఆనందయ్య మందును పంపిణీ చేయవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, కంట్లో వేసే చుక్కల మందుపై గురువారం లోగా పూర్తి నివేదిక అందజేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

మరోవైపు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య కరోనా నివారణకు తయారు చేసిన మందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. కంట్లో వేసే డ్రాప్స్‌ మినహా మిగిలిన అన్ని రకాల మందులకు అనుమతి ఇచ్చింది.  సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల ఎలాంటి హానీ లేదని నివేదికలు తేల్చాయి. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. దీనిపై నివేదికలు రావడానికి మరో 2–3 వారాల సమయం పడుతుందని సమాచారం. అయితే ఆనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందనడానికి ఎలాంటి నిర్ధారణలు లేవని నివేదికల్లో పేర్కొన్నారు. అందువల్ల ఆనందయ్య మందు వేసుకున్నా ఇతర మందులను ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూనే ఎవరి ఇష్టానుసారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చని స్పష్టం చేసింది.

అదేవిధంగా ఆనందయ్య మందును తీసుకోవడానికి కోవిడ్‌ పాజిటివ్‌ రోగులు కృష్ణపట్నం రావొద్దని ప్రభుత్వం కోరింది. వారి బదులుగా కుటుంబసభ్యులు, ఇతరులెవరైనా వచ్చి మందు తీసుకోవాలని సూచించింది. మందు పంపిణీ సందర్భంలో కొవిడ్‌ ప్రోటోకాల్‌ తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement