ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్‌ను డిస్పోజ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన తరఫున న్యాయవాది కోర్టుకి తెలిపారు. పూర్తి పత్రాలతో మరోసారి వ్యాజ్యం దాఖలుకు పిటిషనర్ అనుమతి కోరగా.. ఇందుకు హైకోర్టు అంగీకరించింది. దీంతో పిటిషన్ డిస్పోజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
కాగా, ఎస్‌ఈసీగా నీలంను కొనసాగించడాన్ని చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలైన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అర్థం చేసుకోకుండా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించారని, తద్వారా రూ. 160 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని పిటిషన్ లో ఆరోపించారు. ఆ సొమ్మును ఆమె నుంచే రాబట్టాలని పిటిషనర్ కోర్టును కోరారు. అయితే పూర్తి వివరాలు లేకుండానే పిల్ వేశారంటూ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దీంతో పూర్తి పత్రాలతో మరోసారి పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతించాలని పిటిషనర్ కోరారు. ఆయన అభ్యర్థనను హైకోర్టు అంగీకరించింది.