పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ఏపీ హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. సోమవారం చీఫ్ జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జోయ్మల్య బాగ్చీ, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసులపై విచారణ చేపట్టింది. రాజధాని కేసుల విచారణను వాయిదా వేయాలని పిటిషనర్లు కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసారు. నిర్ణయాన్ని ప్రభుత్వ న్యాయవాదులు హైకోర్టుకే వదిలేశారు. ఈ క్రమంలో.. విచారణను నవంబర్ 15 కి వాయిదా వేసింది.
రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని, పాలన వికేంద్రీకరణ జరుపుతామని జగన్ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత హైకోర్టులో అమరావతి రైతులు, మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో హైకోర్టు సీజే గా ఉన్న జస్టిస్ జె.కె.మహేశ్వరి ఈ వ్యాజ్యాలను విచారించారు. తుది దశకు చేరుకునే సమయంలో అప్పటి ఆయన బదిలీ కావడంతో వ్యాజ్యాలను మళ్లీ విచారిస్తున్నారు.
పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది మార్చి 26న మొదటిసారి విచారణ జరిపి మే 3కు వాయిదా వేసింది. అనంతరం విచారణ సందర్భంగా.. కొవిడ్ నేపథ్యంలో న్యాయవాదుల అభ్యర్థన మేరకు ఆగస్టు 23కు ధర్మాసనం వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండిః ఏపీలోని స్కూళ్లపై కరోనా పంజా.. వైరస్ బారిన పడిన విద్యార్థులు