Friday, November 22, 2024

AP – తుంగభద్ర పరివాహక ప్రాంతంలో హై అలెర్ట్

కర్నూలు, ఆగస్టు 10, ప్రభ న్యూస్ బ్యూరో.తుంగభద్ర డ్యాం 19 వ గేటు కొట్టుకుపోయిన సందర్భంగా 90 వేల క్యూసెక్కుల నుండి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేసినందున మంత్రాలయం, కౌతాళం, కోసిగి, నందవరం, సి. బెళగల్ తహసీల్దార్లు జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆదేశించారు..ఆదివారం ఎస్పీ, సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, జలవనరుల శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు,తహసీల్దార్లతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిన్న రాత్రి తుంగభద్ర డ్యాం 19 వ గేటు కొట్టుకుపోయిన సందర్భంగా నీటిని విడుదల చేసిన సందర్భంగా మంత్రాలయం, కౌతాళం, కోసిగి, నందవరం తహసీల్దార్లు ఉదయాన్నే అప్రమత్తం చేయడం జరిగిందన్నారు.. దండోరా, మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ప్రజలకు నీటి విడుదల విషయాన్ని చెప్పి, నది లోకి దిగనివ్వకుండా, చేపలు పట్టడానికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు..

అయితే ఈరోజు ఉదయం మరో 90 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినందున మంత్రాలయం, కౌతాళం, కోసిగి, నందవరం తహసీల్దారులు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.. అలాగే సి.బెళగల్ తహసిల్దార్ కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఈరోజు వదిలిన 90 వేల క్యూసెక్కుల నీరు ఇంకా రీచ్ కాలేదన్నారు.. రాత్రికి ఏపీ బార్డర్లోకి వస్తుందని, రేపు ఉదయం మంత్రాలయం, రేపు సాయంత్రానికి సుంకేసుల చేరుతుందని,

రాత్రి వదలిన 40 వేల క్యూసెక్కుల నీరు మేలిగనూరు క్రాస్ అయిందని, అందువల్ల వీఆర్వో, వీఆర్ఏలు, పంచాయతీ సెక్రెటరీ లను ఉంచి ప్రజలు నది లోకి దిగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, చేపలు పట్టడానికి వెళ్ళకుండా చూడాలని, అదే విధంగా నీటి ప్రవాహ పరిస్థితిపై పర్యవేక్షణ చేస్తూ ఉండాలని కలెక్టర్ తహశీల్దార్లను ఆదేశించారు. అలాగే ఎస్ డి ఆర్ యఫ్ టీములను సిద్ధంగా ఉంచుకోవాలని, టీములు వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్పీ జి.బిందు మాధవ్ ను ఆదేశించారు..పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, ఫిషరీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు..

- Advertisement -

పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ను ఆదేశించారు.. లైసెన్స్డ్ ఫిషర్ మెన్ ను లైఫ్ జాకెట్లు, పుట్టీ లతో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా ఫిషరీస్ అధికారి ని ఆదేశించారు..

ఆదోని సబ్ కలెక్టర్, మంత్రాలయం, కౌతాళం, కోసిగి, నందవరం తహశీల్దార్ల తో కలెక్టర్ మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.. ప్రజలను అప్రమత్తం చేశామని, తగినంత మంది సిబ్బంది తో పర్యవేక్షణ చేస్తున్నామని సబ్ కలెక్టర్, తహసిల్దార్లు కలెక్టర్ కు వివరించారు..ప్రస్తుతం పరిస్థితి నియంత్రణ లో ఉందని, అధికారులను అప్రమత్తం చేశామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు..

.ఇరిగేషన్ ఎస్ ఈ రెడ్డి శేఖర్ రెడ్డి నీటి విడుదల గురించి వివరిస్తూ ప్రస్తుతం పరిస్థితి నియంత్రణ లో ఉందని తెలిపారు.టెలి కాన్ఫరెన్స్ లో డి ఆర్వో మధుసూదన్ రావు,డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి అనుపమ జిల్లా ఫిషరీస్ అధికారి శ్యామల, ఎస్ డి ఆర్ ఎఫ్ ఇన్చార్జి కమాండెంట్ తదితరులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement