Tuesday, November 19, 2024

AP – తిరుమల కొండపై హెలికాప్టర్ చక్కర్లు ….. భ‌క్తుల అగ్ర‌హం

తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి హెలికాఫ్టర్ చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. ఇవాళ ఉదయం స్వామివారి ఆలయానికి దగ్గర హెలికాప్టర్ వెళ్లింది. కొందరు భక్తులు గమనించి తమ మొబైల్స్‌లో రికార్డ్ చేశారు.. కొందరు భక్తులు ఈ విషయాన్ని టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఆలయం మీదుగా వెళ్లిన ఈ హెలికాప్టర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం విరుద్ధం. అందుకే తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని గతంలోనే.. పలు సందర్భాల్లో కేంద్రాన్ని టీటీడీ కోరింది. కేంద్ర పౌరవిమానయాన శాఖ దృష్టికి మాత్రం ఈ నిబంధన అమలు చేయడం వీలుకాదని తెలిపింది.

గత రెండు, మూడేళ్లుగా శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు ఎగిరిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గతంలో అలాంటి ఘటనలు జరిగిన సమయంలో భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ స్పందించింది. కొంతకాలంగా తరచూ విమానాలు, హెలికాప్టర్లు స్వామివారి ఆలయం మీదుగా వెళుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇలా విమానాలు, హెలికాప్టర్లు ఆలయం మీదుగా చక్కర్లు కొట్టడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

మరోవైపు గతేడాది జనవరిలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ వీడియో కనిపించిన వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. వెంటనే అతడ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియోను అప్‌లోడ్ చేసిన వ్యక్తి హైదరాబాద్ వాసిగా గుర్తించారు కేసుల కూడా నమోదు చేశారు. ఆ తర్వాత హర్యానకు చెందిన మరో వ్యక్తి కూడా తిరుమల సమీపంలో డ్రోన్‌ను ఎగురవేశారు. ఈ విషయంలో కూడా వివాదాస్పదం అయ్యింది. ఆ తర్వాత మరో యువకుడు తిరుమల శ్రీవారి ఆలయంలోకి ఏకంగా మొబైల్ తీసుకెళ్లి.. లోపల వీడియోను తీశాడు. ఈ వీడియో కూడా వైరల్ కాగా అతడిపై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

గతంలో కూడా తిరుమలలో శ్రీవారి ఆలయం మాత్రమే కాదు.. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరకామణి భవనం, బాలాజీనగర్ పైగా నుంచి హెలికాప్టర్లు చక్కర్లు కొట్టిన ఘటనలు ఉన్నాయి. తిరుమల కొండపై తరచూ ఇలా హెలికాప్లర్లు ఎగరడంతో టీటీడీ అప్రమత్తం అయ్యింది. వెంటనే టీటీడీ అధికారులు రేణిగుంటలోని విమానాశ్రయం అధికారులను సంప్రదించగా క్లారిటీ ఇచ్చారు. ఆ హెలికాప్టర్లు భారత వాయుసేనకు చెందినవిగా తెలిపారు.. ఇవి కడప బేస్ క్యాంపు నుంచి చెన్నైకి వెళ్తున్న సమయంలో ఇటుగా వచ్చినట్లు వివరణ ఇచ్చారు. జూన్‌లో కూడా విమానం తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా వెళ్లింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement