Friday, September 20, 2024

AP – వర్షాలతో కృష్ణా జిల్లా అతలా కుత‌లం … జ‌న జీవ‌నం అస్త‌వ్య‌స్తం

భారీ వ‌ర్షాల‌తో జ‌న జీవ‌నం అస్త‌వ్య‌స్తం
చెరువులుగా ర‌హ‌దారులు
ముంపులో గ్రామాలు
చంద‌ర్ల‌పాడులో బైక్ తో కొట్టుకుపోయిన యువ‌కుడు
బంటుమిల్లిలో లో అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోదు

విజ‌య‌వాడ – అల్పపీడనం ప్రభావంతో ఉమ్మ‌డి కృష్ణాజిల్లా అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చి చేరుతున్నాయి. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా. ఏ. కొండూరు మండలం లోని తండాలో ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ.మండలం మండలంలోని పలు చోట్ల ప్రధాన రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. తిరువూరు రూరల్ మండలం లక్ష్మీపురం – విసన్నపేట ప్రధాన రహదారి అలుగుపై వరద నీరు ప్రవహిస్తోంది. తిరువూరు మండలం చౌటపల్లి – జి.కొత్తూరు విప్లవ వాగుకు వరద నీరు పోటెత్తింది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

- Advertisement -

రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు
అత్యధికంగా బంటుమిల్లి మండలంలో 22 సెంటీమీటర్ల వర్షపాతం, కంకిపాడు మండలం 17, గుడివాడ పెనమలూరు 16, పెదపారుపూడి, ఉయ్యూరు 15, పామర్రు, ఉంగుటూరు, నందివాడ 14, పమిడి ముక్కల 13, గుడ్లవల్లేరు, గన్నవరం, మచిలీపట్నం 12, తోట్లవల్లూరు, మొవ్వ, గూడూరు 11, పెడన, బాపులపాడు 10, కోడూరు, ఘంటసాల, కృత్తివెన్ను 8, నాగాయలంక 7, చల్లపల్లి, అవనిగడ్డ 6, మోపిదేవి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు.

ఎన్టీఆర్ జిల్లాలో దంచికొడుతున్న వానలు..
I అత్యధికంగా జి. కొండూరు మండలంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం. ఇబ్రహీంపట్నం, మైలవరం 18, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ రూరల్ 17, ఎ. కొండూరు 12, కంచికచర్ల చందర్లపాడు, రెడ్డి గూడెం, నందిగామ, వీరులపాడు 10, వత్సవాయి 9, జగ్గయ్యపేట తిరువూరు, విస్సన్నపేట మండలాల్లో 8 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్లనుంచి బయటికి రావొద్దని కలెక్టర్ జి. సృజన విజ్ఞప్తి. లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలించాలని రెవిన్యూ అధికారులకు ఆదేశం.

మృత్యుజ‌యుడు..

అలాగే ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే బైక్‌తో వాగు దాటేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి.. బైక్‌తో సహాకొట్టుకుపోయాడు. చివరకు చెట్టును పట్టుకుని వరద నీటిలో ఆ వ్యక్తి చిక్కుకున్నాడు. వెంటనే గ్రామాస్థులు చూసి అత‌డిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే వరద ప్రవాహానికి బైక్ కొట్టుకుపోయింది.

ఇళ్ల‌లోంచి బ‌య‌ట‌కు రావ‌ద్దు … కలెక్ట‌ర్

భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ డీకే బాలాజీ అప్రమత్తం చేశారు. వర్షాల వల్ల ప్రజలెవ్వరూ ఇబ్బందులకు గురి కాకుండా చూడాలన్నారు. అలాగే టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులకు కలెక్టర్ బాలాజీ పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ… భారీ వర్షాల నేపథ్యంలో అధికారులందరినీ అప్రమత్తం చేశామన్నారు. లోతట్టు ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. లంక గ్రామాల ప్రజల కోసం నెల రోజుల సరిపడా నిత్యావసర వస్తువులను సిద్ధం చేశామన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అత్యవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ బాలాజీ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement