Friday, November 22, 2024

AP | విజయవాడలో భారీ వర్షం.. ప‌లు జిల్లాల‌కు భారీ వర్ష సూచన

అమరావతి, ఆంధ్రప్రభ : నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటంతో రాష్ట్రంలో వర్షాలు ఊపందుకున్నాయి. గురువారం విజయవాడతో రాజధాని ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. సుమారు అరగంట పాటు కురిసిన వానతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. బలమైన గాలులు వీడయడంతో కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లడంతో పాటు విద్యుత్‌ సరఫరాలకు అంతరాయం కలిగింది.

ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో 45.7మిమీ, బాపట్ల జిల్లా పర్చూరులో 32.54మిమీ, సత్యసాయి జిల్లా కదిరిలో 20.5మిమీ, అన్నమయ్య జిల్లా పెదతిప్పసముద్రంలో 18.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, కోస్తాంధ్ర వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు వెళ్లేందుకు రానున్న 3-4 రోజులు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్‌ వెల్లడించారు.

తెలంగాణ నుండి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు ద్రోణి కొనసాగుతుందని తెలిపారు. వీటి ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, వైయస్‌ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

శనివారం కృష్ణ, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశుగొర్రెల కాపరులు చెట్లు, పోల్స్‌, టవర్స్‌ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement