ఉమ్మడి కర్నూలు జిల్లా, సెప్టెంబర్ 1, ప్రభ న్యూస్ బ్యూరో.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇది కర్నూలు జిల్లాతో పాటు అటు నంద్యాల జిల్లా చిగురుటాకులా వణుకుతున్నాయి.
ముఖ్యంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వరద నీటితో ప్రజల అవస్థలకు గురవుతున్నారు. కొన్నిచోట్ల ఇళ్లలోకి నీరు రావడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. అ
ధికారులు తమను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్న వారు లేకపోలేదు.ఎమ్మిగనూరు, ఆస్పరి, కోసిగి మండలాల్లో ఆదివారం మోసారుగా వర్షం కురిసింది. ఎమ్మిగనూరు మండలంలో 34.8 మి.మీ.ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. వేరుశనగ, పత్తి, మిరప, పంట పొలాలలో నీరు చేరడంతో పంటలు దెబ్బతిన్నాయని, తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇకకోసిగి మండలంలోని చింతకుంట గ్రామంలో పంటలు నీట మునిగాయి. వందల ఎకరాల మిరప పంట ఇక్కడ నీట మునిగింది. దేవర బెట్టు గ్రామానికి వెళ్లే కల్వర్టు రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ కల్వర్టు రోడ్డు పనులు ఇటీవలే చేసినా వరద తాకిడికి కొట్టుకపోయింది. ఆస్పరి మండలంలోని చిరుమాను దొడ్డి గ్రామంలో టమోటా నీట మునిగింది.. సుమారు 2వేల ఎకరాల్లో టమోటా సాగు చేశారు. టమోటా రైతులు పెట్టిన కేసు పెట్టుబడులు మట్టి పాలయ్యాయి. హొళగుంద మండలంలో గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు ఇక్కడి రోడ్లన్నీ బురదమయమయ్యాయి.
తుగ్గలి, జొన్నగిరిమధ్య వంతెన కోసుకు పోయి వాహనాల రాకపోకలకు అవంతరాలు కలగాయి. ఇక పెద్దకడుబూరు మండలంలో 38.2 మీ.మీ వర్షం కురిసింది.
ఎమ్మిగనూరు, గోనెగండ్ల లో భారీగా పంట నష్టం
మిరప, పత్తి, వరి, కొర్ర నీట మునిగాయి. గోనెగండ్ల మండలంలోని గంజహళ్లి, ఎనకండ్ల,గోనెగండ్ల, ఐరన్‌బండ, వేముగోడు, గాజులదిన్నె తదితర గ్రామాల్లో పంటలు నీట ముని గాయి. ఎమ్మిగనూరు నియోజక వర్గంలో 20వేల హెక్టార్లలో పత్తి, 6వేల హెక్టార్లలో ఉల్లి, 5వేల హెక్టార్లలో వేరుశనగ పంటలు సాగు చేశారు. ఇక గోనగండ్ల లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
పంట పరిశీలనలో పత్తలేని రెవిన్యూ అధికారులు.. జేసీ ఆగ్రహం
గోనెగండ్ల మండలంలో దెబ్బతిన్న పంటలను జాయింట్ కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అయితే జాయింట్ కలెక్టర్ పంటల పరిశీలనకు వచ్చిన సమయంలో రేవిన్యూ అధికారులు అందుబాటు లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా స్థానిక ఎమ్మార్వో కోసం జాయింట్ కలెక్టర్ దాదాపు గంట పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. గంట తర్వాత తాపీగా వచ్చిన ఎమ్మార్వోజాయింట్ కలెక్టర్ ను కలిశారు.
దీంతో ఆమె ఎమ్మార్వో పై మండిపడ్డారు. ఇలాంటి సమయాల్లో నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తే ఎలా అంటూ.. విధినిర్వహణలో అలర్ట్ గా ఉండాలని ఎమ్మార్వోకి సూచించారు. పంట నష్టపరిహారం పై తక్షణమే పరిశీలించి నివేదికలు ఇవ్వాలని ఎమ్మార్వోకి సూచించారు. గోనెగండ్ల మండల పరిధిలో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు వద్ద ప్రజలకు ఎలాంటి విపత్తు జరగకుండా అలర్ట్ గా ఉండాలని ఎమ్మార్వో అని హెచ్చరించారు.
మొత్తంగా ఇప్పటివరకు ఒక ఎమ్మిగనూరు డివిజన్లోనే దాదాపు 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగి ఉంటుందని అంచనా. మొత్తంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు వరకు 5360 హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. చాలా చోట్ల పంటలు నీళ్లలో ఉండడం వల్ల ఈ నష్టం మరింత పెరిగి అవకాశం లేకపోలేదు.
ఇటీవలే కురిసిన వర్షాలకు కర్నూలు జిల్లాలో దాదాపు 4500 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్న సంగతి విధితమే. రైతులు ఆ ఘటనను మరువక ముందే అల్పపీడనద్రోనీ కారణంగా కర్నూలు జిల్లాలో తీవ్రంగా పంట నష్టం వాటిల్లడం గమనార్హం.
ఆదోని డివిజన్ కేంద్రంలో కంట్రోల్ రూమ్
భారీ వర్షాల నేపథ్యంలో ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సమస్యలుంటే 8333989012 నంబర్‌కు కాల్ చేయాలని ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ విశ్వనాథ్ తెలిపారు. రెవెన్యూ, విధ్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్, ఆర్‌అండ్‌బీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశిం చారు.. వాగులు, వంకల వద్ద ప్రజలు ప్రమాదాలకు గురికాంకుడా జాగ్రత్త వహించాలన్నారు.
శ్రీశైలంలో ఘాట్ రోడ్ లో విరిగి పడుతున్న కొండ చరియలు
మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో పాటు, మరో మూడు రోజుల పాటు తుపాను కారణంగా ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగి పడుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం ఘాట్ రోడ్డును మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే మన్ననూరు ఘాట్ రోడ్డును మూసి వేసినట్లు అక్కడ డిఎస్పి శ్రీనివాసులు వెల్లడించారు.
ఘాట్ రోడ్డుపైకి ఏ ఒక్క వాహనాన్ని అనుమతించబోమని స్థానిక డిఎస్పి పేర్కొన్నారు.వచ్చే ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. ఘాట్‌రోడ్డులో మళ్లీ ప్రయాణాలు ప్రారంభించే విషయాన్ని తెలియజేస్తామన్నారు. మరోవైపు శ్రీశైలంలో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో అక్కడి కాలనీలలో చాలావరకు నీట మునిగాయి. కాలనీలలో ఇళ్లలోకి మోకాళ్ళ రోజున నీళ్లు రావడం గమనార్హం.
పొంగి పొర్లిన బనవాసి. మద్దిలేరు వాగు
నంద్యాల పట్టణం నుండి పివి నగర్, భీమవరం వెళ్లేదారిలో మద్దిలేరు వాగుపై వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. దీంతో వంతెన పై అటు,ఇటు వెళ్లకుండా రెవెన్యూ అధికారులు పర్యవేక్షించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా స్వయంగా పరిశీలించారు.మద్దిలేరు వాగు బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేస్తూ ఎవరినీ అనుమతించవద్దని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదేశించారు.
అలాగే కొత్తపల్లి మండలం పరిధిలో బనవాసి వాగు పొంగి పొర్లింది. వాగు వంతెన పైనుంచి సుమారుగా నడుము లోతు నీరు పారడం విశేషం. దీంతో అటు ఇటు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. పోలీసులు దగ్గరుండి మరి జనం వంతెన పై వెళ్లకుండా అడ్డుకుంటూ కనిపించారు.మరోవైపు కుందూ నది వరద ఉధృతిపై అధికంగా ఉండడంతో ఇరిగేషన్ అధికారులను సంప్రదించి లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆర్డీవో, మున్సిపల్ అధికారులు స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు.
కుందుకు సమీపంలోని కాలనీ ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు సురక్షిత ప్రాంతంకు తరలించారు. ఆత్మకూరు సమీపంలోని బైర్లూటి వద్ద నల్లమల అడవిలోని వాగు పొంగి ప్రవహించింది. దీంతో ఆ రహదారి కింద వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పాములపాడు మండల పరిధిలోని భానుమొక్కుల గ్రామంలో భారీ వర్షానికి నీళ్లలోకి నీరు చేరిన ఇళ్లను ఎమ్మెల్యే జయ సూర్య, ఎంపీడీవో గోపికృష్ణ ఈఓఆర్డి గంగాధర్ ఎస్సై సురేష్ బాబు సర్పంచ్, టిడిపి నాయకులు స్వయంగా పరిశీలించారు..
ఇళ్లలోకి నీరు చేరిన అందరిని వారి కుటుంబ సభ్యులను హై స్కూల్ ఆవరణంలోకి తరలించి భోజనాలు ఏర్పాటు చేశారు. ఇళ్లలో ఎవరు ఉండదని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు. కొత్తపల్లి మండలం శివపురం వద్ద రహదారిపై వాగు పొంగి పొర్లి ప్రవహిస్తుంది. దీంతో అక్కడికి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహానంది సమీపంలో వాగు రహదారిగా అడ్డంగా ప్రవహించడంతో రాకపోకలను నిలిపివేశారు.
భయం గుప్పెట్లో… వేంపెంట అడవి బిడ్డలు
జోరుగా కురుస్తున్న వర్షాలతో చెంచుల జీవనం అస్తవ్యస్తంగా కనిపించింది. ముఖ్యంగా నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామంలోని చెంచు కాలనీలో జోరుగా కురుస్తున్న వర్షాలతో భయం గుప్పెట్లో అడవి బిడ్డలు అష్ట కష్టాలకు గురికావాల్సి వచ్చింది. చెంచులను నివసిస్తున్నగుడారంలోకి వర్షపు నీరు చేరడంతో నిద్రించడానికి లేక చిన్నపిల్లలతో అవస్థలుపట్టించుకునే అధికారులే లేకపోవడం సిగ్గుచేటు.
ఇక్కడి కాలనీలో దాదాపు 30 కుటుంబాలు చెంచులు ఇల్లు కట్టుకోవడానికి స్తోమత లేక ప్రభుత్వం ఇచ్చిన స్థలాలలో తారు పట్టాలతో గుడారాలు వేసుకుని జీవనం చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న జోరు వర్షాలతో బట్టలన్నీ కారుతూ కాలనీ మొత్తం వర్షపు నీరు చేరింది. దీంతో రాత్రి వేళల్లో పడుకోవడానికి కూడా వీలు లేక చంటి పిల్లలతో నానా అవస్థలు గురవడం కనిపించింది. ఒకవైపు దోమలు, మరొకవైపు గుడారాల్లో చేరిన వర్షపు నీరు చెంచులను తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
వాస్తవంగా జోరు వానలు పడితే ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉంటూ సురక్షిత ప్రాంతాలకు వీరిని తరలించాలి. కానీ వేంపెంట గ్రామంలోని చెంచు కాలనీవాసుల కష్టాలను పట్టించుకునే అధికారులే లేకపోవడం గమనార్హం. అడవి బిడ్డలు అంటే మనుషులు కాదా వారి బాధలను పట్టించుకోవాల్సిన బాధ్యత ఎవరిదన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఇప్పటికే ఇక్కడ చెంచుగూడెంలో డయేరియా ప్రబలడంతో ఒకరు మృత్యువాత పడ్డారు. దీంతో చెంచు కాలనీవాసులు కూడా భయాందోళన చెందుతున్నారు. కనీసం వ వంట చేసుకోవడానికి కూడా వీలు లేక వర్షం మూలంగా పిల్లలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది అంటున్నారు.