దసరా వేళ జనం బేజారు
లిక్కర్ కింగ్‌ల నయా దోపిడీ
వారం రోజులుగా కృత్రిమ కొరత
షాపుల ముందు క్యూ కడుతున్న మద్యం ప్రియులు
పొలికల్ పార్టీలకు అతీతంగా సిండికేట్ దందా
పట్టించుకోని అధికార యంత్రాంగం
ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ:
ఒక వైపు ఆదాయం కోసం ప్రభుత్వం తపిస్తుంటే.. మరో వైపు మద్యం వ్యాపారం చేజారకూడదని లిక్కర్ సిండికేట్ కొత్త ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగా సామధాన బేధ డంపోయాలను ముందుకు తెస్తోంది. రెండు మూడు రోజుల్లోనే చేతిలోని సరుకును వదిలించుకునే ప్లాన్ అమల్లోకి తీసుకొచ్చింది. మార్కెట్లో మద్యం కొరత ఉందని, బార్ల ముందు నోస్టాక్ బోర్డులు పెట్టేశారు. దీంతో లిక్కర్ కోసం జనం క్యూకడుతుండడం ఏపీలో కనిపిస్తోంది. క్వార్టర్ సీసాకు ₹50 పెంచినా.. పండగ పూట మందు దొరకదనే భయంతో మద్యం ప్రియులు ఎగబడుతుంటే.. వైన్స్, బార్లు కిటకిటలాడుతున్నాయి. దసరా పండుగకు మద్యం సిండికేట్ సృష్టించిన ఈ నోస్టాక్ సిస్టమ్ ఏపీలో గందరగోళం సృష్టిస్తోంది.
పోతే పోనీ.. ఉన్నదే దక్కుతుంది..
ఏపీలో కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తెరమీదకు తీసుకురాగా.. రెండు వారాలుగా మద్మం కృత్రిమ కొరత ఏర్పడింది. మొదట్లో దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో విక్రయాలకు అంతరాయం ఏర్పడింది. పోయే ఉద్యోగం ఉంటే ఎంత, పోతే ఎంత అనుకుని అందిన కాడికి మద్యం నిల్వలను బెల్టు షాపులకు తరలించారు. ప్రతి బాటిల్‌పై ₹10 నుంచి ₹25వరకు బ్రాండ్‌ను బట్టి అదనంగా వసూలు చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు పూర్తిగా మూతబడతాయి. ప్రభుత్వ దుకాణాల్లో విక్రయాలపై ఆంక్షల్ని లెక్క చేయడం లేదు. ఏపీబీసీఎల్ నుంచి మద్యం దుకాణాలకు సరఫరా చేసే బ్రాండ్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. దుకాణాలకు బదులు బార్‌లకు సరఫరా చేయడం మేలని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. దీంతో సేల్స్ ఎక్కువగా ఉండే బ్రాండ్లు మద్యం దుకాణాల్లో కనిపించడం లేదు. దసరా పండుగను ఉత్సాహంగా చేసుకునే అసంఘటిత రంగ కార్మికుల జేబులకు ఈ రూపంలో చిల్లు పడుతోంది.
బార్లకు కాసుల పంట
మరోవైపు ప్రైవేట్ మద్యం దుకాణాలకు లైసెన్స్‌ల కేటాయింపు ప్రక్రియ దసరా నాటికి కొలిక్కి తేవాలని భావించినా మద్యం సిండికేట్ల దెబ్బతో దరఖాస్తుల సంఖ్య తగ్గింది. ఇక గడువు తేదీ పొడిగించక తప్పలేదు. శుక్రవారం సాయంత్రం వరకు మద్యం దుకాణాలకు టెండర్లు వేసేందుకు గడువు ఉంది. దుకాణాల లాటరీ ప్రక్రియను అనుకున్న గడువులోగా పూర్తి కాలేదు. దీంతో గత రెండు వారాలుగా బార్ అండ్ రెస్టారెంట్లకు కాసుల వర్షం కురుస్తోంది. ఎక్సైజ్ శాఖ కూడా వాటినే ప్రోత్సహిస్తోంది. దీంతో ప్రతి క్వార్టర్ మీద ధర పెంచేసినా.. ఎక్సైజ్ అధికారులు కనీసం పట్టించుకోవటం లేదు.