Tuesday, November 26, 2024

AP: అతిపెద్ద రుణ మేళాను ప్రారంభించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

ఏలూరు : భారతదేశంలోని ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో రుణ మేళాను నిర్వహించింది. వి.ప్రసన్న వెంకటేష్ ఐఏఎస్, కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఆర్ బీ గ్రూప్ హెడ్ రాహుల్ శ్యామ్ శుక్లాతో కలిసి రుణ మేళాను ప్రారంభించారు. దాదాపు 3,500 మంది వినియోగదారులు ఏలూరులో నిర్వహించిన ఇటువంటి అతిపెద్ద రుణ మేళాకు హాజరయ్యారు. ఇందులో చిన్న, సన్నకారు రైతులు, ఎఫ్‌పీఓలు, అగ్రి స్టార్టప్‌లు, చిన్న అగ్రి వ్యవస్థాపకులు, ట్రాన్స్‌పోర్టర్లు, దుకాణదారులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, ఎంఎస్ఎంఈ ప్రతినిధులు ఉన్నారు.

ఈసంద‌ర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సిఆర్‌బి గ్రూప్ హెడ్ రాహుల్ శ్యామ్ శుక్లా మేళాను ప్రారంభించిన అనంత‌రం మాట్లాడుతూ… కృష్ణా-గోదావరి ప్రాంత ఆర్థిక వృద్ధికి సహకరించేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. నేడు, మన చిన్న వ్యాపారాలు, రైతులు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థ సదుపాయాలు ఆశించిన స్థాయిలో అందుబాటులో లేవన్నారు. ఇప్పటికీ 6-7 కోట్ల మంది చిన్న రైతులు, దుకాణదారులు అనధికారిక వ్యవస్థ నుంచి అధిక ధరకు రుణాలను తీసుకుంటున్నారన్నారు. ఈ మేళా బ్యాంకింగ్‌ను అవసరమైన వారికి చేరవేసేందుకు, గ్రామీణ శ్రేయస్సుకు దోహదపడే దిశగా ఒక అడుగు ముందుకు వేస్తోందన్నారు. బ్యాంక్‌గా త‌మ పరిణామం మెట్రో నుంచి పట్టణానికి, ఆపై సెమీ అర్బన్ నుంచి గ్రామీణ భారతదేశానికి కొనసాగుతోందన్నారు. బ్యాంక్ 688 జిల్లాల్లోని ఎస్ఎంఈలకు రుణాలను అందిస్తూ, దాదాపు 2 లక్షల గ్రామాలకు అగ్రి ఫైనాన్స్ అందించేందుకు శ్రమిస్తోందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement