జి.మాడుగుల కేజీబీవీ కళాశాలలో విద్యార్థినుల జుత్తు కత్తిరించిన ప్రత్యేకాధికారిణితోపాటు మరొక అధ్యాపకురాలిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 15న కళాశాల ప్రత్యేకాధికారిణి సాయి ప్రసన్న బైపీసీ చదువుతున్న 18 మంది విద్యార్థినుల జుత్తు కత్తిరించగా, కెమిస్ట్రీ అధ్యాపకురాలు వారిపై చేయి చేసుకుని కులం పేరుతో దూషించారని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సోమవారం విచారణ జరిపారు. బాధ్యులపై ఇంకా చర్యలు తీసుకోలేదంటూ మంగళవారం కళాశాల విద్యార్థినులు తరగతులు బహిష్కరించి ఆరుబయట కూర్చుని నిరసన తెలియజేశారు. పోలీసులు, కళాశాల సిబ్బంది చెప్పిన ఆపలేదు.
దీంతో ఏటీడబ్ల్యూవో తిరుపాల్ వారి వద్దకు వెళ్లి సంబంధిత కేజీబీవీ ప్రత్యేకాధికారిణి సాయిప్రసన్నతో పాటు కెమిస్ట్రీ అధ్యాపకురాలు బి.వాణిని సస్పెండ్ చేసిన ఉత్తర్వులు చూపించడంతో నిరసనను విరమించి తరగతులకు హాజరయ్యారు. టీఎన్ఎస్ఎఫ్ నాయకులు త్రినాథ్, బాలకృష్ణ, ఎల్.సత్యనారాయణ తదితరులు కళాశాలకు వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు.