బచావత్ ట్రైబ్యునల్ తీర్పుపై సమీక్ష చట్ట విరుద్ధమంటూ కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. తుది నిర్ణయం తీసుకునే ముందు రెండు రాష్ట్రాల వాదనలు వినాలని కోరింది. బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులను మార్చేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. ఇదే అంశంపై 2015లో కేంద్రానికి అభిప్రాయాలు తెలిపామని, అదనపు అంశాలతో ఇప్పుడు రాసిన లేఖనూ పరిగణనలోకి తీసుకోవాలని విన్నవించింది. బచావత్ ట్రైబ్యునల్ తీర్పును సమీక్షించాలంటూ తెలంగాణ కోరడం సరికాదని, దీనిపై నిర్ణయం తీసుకొనేముందు నేరుగా రెండు రాష్ట్రాల వాదనలూ వినాలని కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ కోరింది.
తెలంగాణ విజ్ఞప్తి అంతర్రాష్ట్ర జలవివాద చట్టం-1956లోని సెక్షన్(3) పరిధిలోకి రాదని, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధమని పేర్కొంది. బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులను మార్చేందుకు వీల్లేదని తెలిపింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి కార్యదర్శికి ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు తాజాగా లేఖ రాశారు. ఇదే అంశంపై 2015లో కేంద్రానికి తమ అభిప్రాయాలను తెలిపామని, ప్రస్తుతం అదనపు అంశాలతో లేఖ రాస్తున్నామని, వీటినీ పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
లేఖలో ముఖ్యాంశాలు ఇవీ..
‘మొదటి కృష్ణా ట్రైబ్యునల్ అంతర్రా¦ష్ట్ర జలవివాద చట్టంలోని సెక్షన్ 5(3) ప్రకారం ఇచ్చిన తుది తీర్పును 1976 మే 31న కేంద్రం గెజిట్‌లో ప్రచురించింది. 2002లో కేంద్రం చేసిన చట్టసవరణ ప్రకారం, సవరణకు ముందు ట్రైబ్యునల్ పరిష్కరించిన జల వివాదాన్ని మళ్లీ తెరవడానికి వీల్లేదు. కృష్ణా ట్రైబ్యునల్-1 ఈ చట్ట సవరణకు ముందుది కాబట్టి, ట్రైబ్యునల్ తీర్పే అంతిమం. కేటాయింపులు సహా దేన్నీ ముట్టుకోవడానికి వీల్లేదు. ఈ కారణంగానే కృష్ణా ట్రైబ్యునల్-2 కూడా మొదటి ట్రైబ్యునల్ 75% నీటిలభ్యత ఆధారంగా చేసిన కేటాయింపుల జోలికి వెళ్లలేదు. మొదటి ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించింది. ఇందులో 1971 మే 7న జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం 749.16 టీఎంసీలకు రక్షణ కల్పించింది. దీనికి అదనంగా 50.84 టీఎంసీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించగా, ఇందులో తెలంగాణ ప్రాంతంలోని జూరాలకు 17.84 టీఎంసీలు, శ్రీశైలంలో ఆవిరి అయ్యే నీటి కింద 33 టీఎంసీలు ఉన్నాయి. ముందుగానే వినియోగంలో ఉన్నవాటిని సంరక్షించే విధానంతో ఇచ్చిన 749.16 టీఎంసీలలో కృష్ణాబేసిన్‌లో తెలంగాణ ప్రాజెక్టులకు 270.12 టీఎంసీలు కేటాయించింది.
తమకు అన్యాయం జరిగిందని 2014లో జులైలో తెలంగాణ చేసిన ఫిర్యాదులోని అంశాలను మొదటి ట్రైబ్యునలే తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 కూడా 75% నీటిలభ్యత ప్రకారం నికర జలాలకు సంబంధించి మొదటి ట్రైబ్యునల్ చేసిన కేటాయింపులు అలాగే ఉంటాయని పేర్కొంది. మొదటి ట్రైబ్యునల్ వివిధ ప్రాజెక్టులకు ఇచ్చిన రక్షణలో మార్పులు, రద్దు చేయడం కుదరదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులే ప్రస్తుత తెలంగాణ కేటాయింపు. రెండు ట్రైబ్యునళ్లు, పునర్విభజన చట్టంలోని అంశాలను పరిగణనలోకి తీసుకొంటే తెలంగాణ తన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలన్నీ అంతర్రాష్ట్ర జలవివాద చట్టంలోని సెక్షన్ 3 పరిధిలోకి రాదు. కేంద్రం నిర్ణయం తీసుకొనే ముందు రెండు రాష్ట్రాల వాదనలు నేరుగా వినాలి’ అని కోరింది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత మొత్తం కృష్ణాజలాల కేటాయింపుపై సమీక్ష జరపాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రయోజనాలకు తగ్గట్లుగా వాదనలు వినిపించలేదని, అంతర్రాష్ట్ర జలవివాద చట్టంలోని సెక్షన్(3) ప్రకారం విచారణ చేపట్టాలని కోరుతూ 2014 జులై 14న కేంద్రానికి తెలంగాణ లేఖ రాసింది. దీనిపై 2015 జూన్ 1న కేంద్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వివరణ కోరగా, అదే ఏడాది జులై 8న సమాధానం ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉనికిలోనే లేదని, లేని రాష్ట్రంపై అందులోని కొంత భాగంతో ఏర్పడిన కొత్త రాష్ట్రం ఆరోపణలు చేయడం సరికాదంటూ సెక్షన్(3) పరిధిలోకి తెలంగాణ ఫిర్యాదు రాదని పేర్కొంది. కేంద్రం సానుకూలంగా స్పందించకపోవడంతో సుప్రీంకోర్టులో తెలంగాణ కేసు దాఖలుచేసింది. అప్పటినుంచి ఆ కేసు కోర్టులో విచారణలో ఉంది.
గత ఏడాది అక్టోబరు 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా నీటి కేటాయింపులో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించేందుకు సెక్షన్(3) ప్రకారం కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుచేయడం లేదా ప్రస్తుతం ఉన్న బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌కే అప్పగించడం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. సుప్రీంకోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకొంటే తెలంగాణ ఫిర్యాదుపై న్యాయసలహా తీసుకొని ట్రైబ్యునల్‌కు అప్పగించే విషయంపై సానుకూలంగా స్పందిస్తామని కేంద్ర జల్ శక్తి మంత్రి చెప్పారు. దీనికి తగ్గట్లుగానే కేసు ఉపసంహరణకు సుప్రీంకోర్టులో దరఖాస్తు దాఖలు చేసిన తెలంగాణ.. ఇదే విషయాన్ని గత నెల 15న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు సమాచారమిచ్చింది. దీనిపై కేంద్రం నిర్ణయం రావలసి ఉండగా, తాజాగా ఈ నెల 6న ఆంధ్రప్రదేశ్ దీనిపై అభ్యంతరం చెప్పడంతోపాటు నిర్ణయం తీసుకొనేముందు తమ వాదన వినాలని కేంద్రాన్ని కోరింది. మరోవైపు తెలంగాణ దాఖలుచేసిన ఉపసంహరణ దరఖాస్తు శుక్రవారం సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు వచ్చినట్లు తెలిసింది.
ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో 50 వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్