ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలు కానుంది. కొత్త జిల్లాల్లో ఇంటిsగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే, రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాతే ఉద్యోగుల విభజన జరగనుంది. కొత్త జిల్లాలపై అభ్యంతరాలను మార్చి 3 వరకు స్వీకరిస్తామని ఏపీ ప్లానింగ్ సెక్రటరీ విజయకుమార్ స్పష్టంచేశారు.
ఏపీలో పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన 26 జిల్లాలను ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. అరకు నియోజకవర్గం విస్తీర్ణం దృష్ట్యా రెండు జిల్లాలుగా విడిపోనుంది. ఏప్రిల్ 2నాటికి కొత్త జిల్లాల నుంచి పాలన సాగలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే జిల్లాలపై అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు కొత్త కలెక్టరేట్లు, ఏస్పీ కార్యాలయాలు, ఇతర ఆఫీసుల నిర్మాణానికి స్థలాల ఎంపికకు కసరత్తు జరుగుతోంది. జిల్లాల పునర్వవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల కేటాయింపు, పోస్టుల విభజనకు సంబంధించి మార్గదర్శకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. కొత్త జిల్లాల్లో ఈ కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే ఉద్యోగులకు ఆప్షన్ ఫార్మ్ లను జారీ చేసిన ప్రభుత్వం.. సీఎస్ నేతృత్వంలోని రాష్ట్రస్థాయి కమిటీ వీటిని పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది. ఏప్రిల్ 2 ఉగాది నాటి నుంచి కొత్త జిల్లాల్లోని పునర్వవస్థీకరించిన ప్రభుత్వ కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్లు పనిచేయడం ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్ 2 తేదీని జిల్లాల పునర్వవస్థీకరణకు సంబంధించి అప్పాయింటెడ్ డే గా పేర్కోంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.