Friday, November 22, 2024

నిన్న నేరం – నేడు చ‌ట్టం …పొరుగు రాష్ట్రాల‌ లిక్క‌ర్ కు ప్ర‌భుత్వ స్టిక్క‌ర్

అమరావతి, ఆంధ్రప్రభ: ఒకప్పుడు పొరుగు రాష్ట్రాల మద్యం ఉంటే నేరం. ఇప్పుడది చట్టబద్ధంగానే దొరుకు తోంది. అదేంటనుకుంటున్నారా? అవును. పొరుగు రాష్ట్రాల నుంచి ప్రభుత్వమే దిగుమతి చేసుకొని బార్లు, మద్యం షాపులకు సరఫరా చేస్తోంది. ఉమ్మడి ఏపీతో పాటు రాష్ట్ర విభజన తర్వాత పేరొందిన బ్రాండ్ల మద్యం ఇప్పుడు రాష్ట్రంలో దొరకడం లేదు. రోజు రోజుకూ గతంలోని పాత బ్రాండ్లపై డిమాండ్‌ పెరుగుతుండటంతో ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగింది. ఎన్నికల ఏడాది కావడంతో విపక్ష పార్టీలు తెరపైకి బ్రాండ్ల అంశాన్ని తెచ్చే అవకాశం ఉందని గుర్తించిన ప్రభుత్వం కొద్ది రోజుల కిందట ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాత బ్రాండ్లను అందుబాటులో ఉంచేందుకు నిర్ణయించింది. తద్వారా ఎప్పటి నుంచో వినియోగదారులు అడుగుతున్న బ్రాండ్లు ఇచ్చినట్లు ఉండటమే కాక విపక్ష పార్టీలకు చెక్‌ పెట్టొచ్చనేది ప్రభుత్వ ఆలోచన. గతంలో పాత బ్రాండ్ల కొనుగోలుకు ప్రభుత్వం అంతగా ఆసక్తి చూపకపోవడంతో ఆయా సంస్థలు డిస్టిలరీలు ఏర్పాటు చేయలేదు. ఉన్న డిస్టిలరీలను మూసేసి లైసెన్స్‌లు కూడా రెన్యువల్ చేసుకోలేదని తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కొత్తగా డిస్టిలరీలు ఏర్పాటు చేయడం లాభసాటి కాదని చెప్పడంతో ఇతర ప్రాంతాల నుంచి సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఒకే చెప్పింది. ఇందులో భాగంగా దిగుమతి సుంకం కట్టించుకొని పాత బ్రాండ్ల మద్యం ఏపీబీసీఎల్‌ దిగుమతి చేసుకుంటుంది. ఇక్కడ ఇంపోర్టెడ్‌ లేబుల్‌ వేసి బార్లకు, మద్యం షాపులకు సరఫరా చేస్తున్నారు.

కొత్త మద్యం పాలసీ..
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం, బార్‌ పాలసీ తీసుకొచ్చింది. ప్రైవేటు నిర్వహణలోని మద్యం షాపులను స్వాధీనం చేసుకొని షాపుల సంఖ్యను కుదించింది. గతంలో మద్యం సరఫరాకే పరిమితమైన ఏపీబీసీఎల్‌కు షాపుల నిర్వహణ బాధ్యతను కూడా అప్పగించింది. గత ఏడాది కొత్త బార్‌ విధానం కూడా అమలులోకి తీసుకొచ్చింది. కొత్త మద్యం పాలసీ అమలులో పలు కొత్త బ్రాండ్లు తెరపైకి వచ్చాయి. గతంలో రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ చూడని బ్రాండ్లు షాపులు, బార్లలో దర్శనం ఇవ్వడంతో తొలి రోజుల్లో మద్యం అమ్మకాలు పెద్దగా సాగలేదు. ఓ వైపు రేట్లు పెరగడం, మరో వైపు కోరిన బ్రాండ్లు లేకపోవడంతో సరిహద్దు రాష్ట్రాల వైపు మందుబాబులు పరుగులు తీశారు. పొరుగు రాష్ట్రాల్లో దొరికే పాత బ్రాండ్లకు క్రేజ్‌ పెరగడంతో వ్యవస్థీకృత ముఠాలు రంగ ప్రవేశం చేశాయి. వివిధ మార్గాల్లో రాష్ట్రానికి సుంకం చెల్లించని మద్యం తరలిస్తూ రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టాయి. వీటిని కట్టడి చేసేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాన్ని పటిష్టం చేయడంతో పాటు అంతకు ముందున్న రెండు బాటిళ్ల అనుమతిని కూడా రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇతర రాష్ట్రాల మద్యం అమ్మినా, దగ్గర ఉంచుకున్నా చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చింది.

ఇది సర్వసాధారణమే..
ఇతర రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి చేసుకోవడం సాధారణమేనని అధికారులు చెపుతున్నారు. ఇక్కడి డిస్టిలరీలు డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా చేయని సందర్భాల్లో సంబంధిత బ్రాండ్ల అనుమతులున్న ఎక్కడి డిస్టిలరీల నుంచైనా దిగుమతి చేసుకోవచ్చు. కొన్ని చోట్ల డిస్టిలరీల నిర్వహణ లాభసాటిగా ఉండదని భావించినప్పుడు వేరే రాష్ట్రాల్లోని తయారీ యూనిట్లు ఇక్కడికి తరలింపు వీలు పడదు. ఇలాంటి సందర్భాల్లో వీరి నుంచి దిగుమతి సుంకం చెల్లించుకొని ఏపీబీసీఎల్‌ సేకరిస్తుంది. కొన్ని బ్రాండ్లు గోవా, ఢిల్లి, పంజాబ్‌ తదితర ప్రాంతాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు. వీటిని ఏపీబీసీఎల్‌ డిపోలకు తరలించిన తర్వాత ఇంపోర్టు స్టిక్కర్లు వేసి షాపులు, బార్లకు సరఫరా చేస్తుంటారు. ఒక రాష్ట్రం దిగుమతి చేసుకునే మద్యం బాటిళ్లపై ఏ రాష్ట్రానికి సరఫరా చేస్తున్నారు? అమ్మకాలను ఆ రాష్ట్రానికే పరిమితం చేసినట్లు పేర్కొంటూ బాటిల్స్‌పై ముద్రించి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement