అమరావతి – రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు దేశంలోనే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్కిల్ సెన్సస్ కార్యక్రమాన్ని మరింత ప్రయోజనకరంగా చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక సహకారం అందించడానికి ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ ముందుకు వచ్చింది. ఎటువంటి ఆర్థికవనరులతో సంబంధం లేకుండానే స్కిల్ సెన్సస్ లో భాగంగా జనరేటివ్ ఎఐని ఉపయోగించి అభ్యర్థుల నైపుణ్యాల ముందస్తు ధృవీకరణ కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అందించేందుకు ఇన్ఫోసిస్, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్ఎస్డిసి) నడుమ రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్కిల్ సెన్సస్ డాటా ప్రివాలిడేషన్ కు ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. దీనిద్వారా రాష్ట్రంలో యువత ప్రస్తుత నైపుణ్యాలను అంచనా వేసి, మార్కెట్ డిమాండ్ కు తగ్గట్టుగా వారికి స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇవ్వడానికి మార్గం సులభతరం అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో రాబోయే అయిదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాల లక్ష్యసాధనలో భాగస్వామి కావడానికి ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ప్రతినిధులు సంతోష్, తిరుమల, స్కిల్ డెవలప్ మెంట్ కార్యదర్శి కోన శశిధర్, స్కిల్ డెవలప్ మెంట్ ఉన్నతాధికారులు గణేష్ కుమార్, దినేష్ కుమార్, రఘు పాల్గొన్నారు.