ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లను ప్రభుత్వమే విక్రయించే విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 1955 నాటి ఆంధ్రప్రదేశ్ సినిమాల నియంత్రణ చట్ట సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయనుంది. టికెట్ల విక్రయానికి ఏపీఎఫ్‌డీసీ ప్రత్యేక పోర్టల్‌ను అభివృద్ధి చేస్తుంది. ప్రేక్షకులకు సౌకర్యంగా ఉండేలా ఆన్‌లైన్‌తోపాటు ఫోన్‌కాల్, ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా టికెట్లు బుక్ చేసుకునే విధానం అందుబాటులోకి తీసుకురానున్నారు. థియేటర్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు, ప్రేక్షకులకు సమయం ఆదా చేసేందుకు, పన్నులు ఎగ్గొట్టడాన్ని నివారించేందుకు కొత్త విధానం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
కాగా, సింగిల్ థియేటర్లు, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఆన్ లైన్ బుకింగ్ పేరుతో మధ్యవర్తులు భారీ మొత్తాలను నొప్పి తెలియకుండా వసూల్ చేసేస్తున్నారు. టిక్కెట్ కు పది రూపాయల నుండి ఇరవై రూపాయల వరకూ అదనంగా సర్వీస్ ఛార్జీల పేరుతో దోచుకుంటున్నారు. అలాంటి వాటికి చెక్ పెడుతూ ఆన్ లైన్ బుకింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. బ్లాక్ టికెట్ దందాతో థియేటర్ యజమానులు ఎగ్జిబిటర్లు ప్రజల్ని నిలువు దోపిడీ చేస్తున్నారన్న భావన ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది. ఇన్నాళ్లు ప్రభుత్వాలు దీనిని చూసీ చూడనట్టు వ్యవహరించాయి. కానీ ప్రస్తుతం ఏపీలో పాగా వేసిన వైసీపీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితిలో పన్ను ఎగవేతల్ని ఉపేక్షించేది లేదని మొండి పట్టుతో ఉంది.
ఇప్పటికే పలుమార్లు సినీప్రముఖులతో మంత్రి పేర్ని నాని భేటీలో ఇదే విషయాన్ని కుండబద్ధలు కొట్టిన సంగతి తెలిసిందే. బ్లాక్ మార్కెట్ దందాకు చెక్ పెట్టే వరకూ నిదురించే ఆలోచనలో సీఎం జగన్ లేరని పేర్ని చాలా స్పష్ఠంగా సినీపెద్దలకు వెల్లడించారు. అందుకే ప్రభుత్వ పోర్టల్ ని ప్రారంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని థియేటర్ల టిక్కెట్లు ఇక ఈ పోర్టల్ ద్వారానే అమ్మాల్సి ఉంటుంది. తొలిగా సినీపెద్దల్ని సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని పన్ను ఎగవేతల్ని నిలువరించేందుకే ఈ ఏర్పాటు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
ఇది కూడా చదవండి: Corona fear: ఆంక్షల చట్రంలోకి ప్రపంచ దేశాలు.. లాక్ డౌన్ వైపు అడుగులు!