Saturday, November 23, 2024

పోలియో రహిత సమాజమే మన ధ్యేయం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్

పోలియో రహిత సమాజమే మన ధ్యేయం కావాలని, ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు అందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో పోలియో కేసులు నమోదు కావటం లేదని అదే పరంపరను కొనసాగించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఆదివారం రాజ్ భవన్ దర్బార్ హాలులో గవర్నర్ పోలియో చుక్కల పంపిణీని చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమం విజయవంతానికి ఆరోగ్యశాఖ విస్తృత ఏర్పాట్లు చేయగా, మొత్తం 52,93,832 మంది చిన్నారుల కోసం 66.95 లక్షల డోసులు సిద్ధం చేశారని గవర్నర్ తెలిపారు. 37,969 కేంద్రాలలో పోలియో చుక్కల కార్యక్రమం జరుగుతుండగా,  బస్‌స్టాండ్లు, రైల్వేస్టేషన్ల తో పాటు ముఖ్యమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన పల్స్‌ పోలియో కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.  మరోవైపు 1374 మొబైల్‌ టీమ్ లు సైతం చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలను పంపిణీ చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ హైమావతి, సంయిక్త సంచాలకులు డాక్టర్ అర్జునరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుహాసిని , నగర పాలక సంస్ధ వైద్యాధికారి డాక్టర్ బాబు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement