న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వరుస భేటీలతో సోమవారం బిజీ బిజీగా గడిపారు. ఉదయం ముందుగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతికి పుష్పగుచ్ఛంతో పాటు వేంకటేశ్వర స్వామి ప్రతిమను బహుమతిగా అందజేశారు. రాష్ట్రంలోని పరిస్థితులను గవర్నర్ ఆయనకు వివరించారు. సాయంత్రం సమయంలో హోం శాఖ మంత్రి అమిత్ షాను నార్త్ బ్లాక్‌లోని ఆయన కార్యాలయంలో కలిశారు.
రాత్రికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రపతి, రక్షణమంత్రి, హోంమంత్రితో గవర్నర్ బిశ్వభూషణ్ వరుస సమావేశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మర్యాదపూర్వక భేటీలనే చెప్తున్నప్పటికీ ఆయన కేంద్రానికి ఏయే అంశాలను నివేదిస్తున్నారనే అంశం ఉత్కంఠగా మారింది. శుక్రవారం ఢిల్లీ వచ్చిన గవర్నర్ వివిధ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. మంగళవారం ఆయన పర్యటన ముగించుకుని విజయవాడ తిరిగి వెళ్లనున్నారు.