ఏపీలో కొత్త కేబినెట్ కొలువుదీరేందుకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 24 మంది మంత్రుల చేసిన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు.
మరోవైపు ఏపీ నూతన మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ కొత్త మంత్రివర్గంలోకి 10 మంది పాత వారికి అవకాశం కల్పించినట్లు తెలిసింది. అలాగే 15 మంది కొత్తవారు కేబినెట్‌లోకి తీసుకోబోతున్నారు. మంత్రివర్గ సహచరుల కోసం ఏర్పాటైన కోర్ కమిటీతో సీఎం జగన్ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో మంత్రుల పేర్లను ఖరారు చేశారు. ఆ జాబితా గవర్నర్‌కు పంపనున్నారు.
ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, అప్పలరాజు, వేణుగోపాల కృష్ణ, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, అంజాద్‌బాషా, బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి కేబినెట్‌లో మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిసింది. అలాగే, ఏపీ మంత్రి వర్గంలో కొత్తగా కాకాణి గోవర్దన్‌రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, జోగి రమేశ్, విడదల రజనీ, రాజన్న దొర, మేరుగ నాగార్జున, పార్థసారథి, కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్నాథ్, ధనలక్ష్మికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. మొత్తం 25 మంది నూతన మంత్రుల జాబితాను గవర్నర్ వద్దకు పంపనున్నట్లు తెలుస్తోంది. కాగా, రేపు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం కార్యక్రమం జరగనుంది. వెలగపూడి సచివాలయ భవన సముదాయం పక్కనున్న పార్కింగ్ స్థలంలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 11:31 గంటల నుంచి నిర్వహించనున్నారు.