అమరావతి, ఆంధ్రప్రభ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోని ఉల్లంఘనలను నిర్ధారిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ జరిమానా విధించింది. రూ 120 కోట్లను జరిమానాగా చెల్లించాలని గురువారం ఏపీ కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే పోలవరం..అనుబంధ ప్రాజెక్టులను డిజైన్ చేసి నిర్మిస్తున్నారని పెంటపాటి పుల్లారావు, వట్టి వసంతకుమార్ లు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేసిన ఎన్జీటీ ఈ మేరకు ఉల్లంఘనలపై జరిమానా విధించింది.
పోలవరంతో పాటు మరో మూడు ప్రాజెక్టులపై కూడా జరిమానా విధించింది. పట్టిసీమ ప్రాజెక్టుల ఉల్లంఘటనలపై రూ 24.90 కోట్లు, చింతలపూడి ప్రాజెక్టుకు సంబంధించి రూ 73.6 కోట్లు, పురుషోత్తంపట్నం ప్రాజెక్టు నిర్మాణ ఉల్లంఘనలపై రూ 24.56 కోట్ల జరిమానా విధిస్తూ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) సభ్యులతో కమిటీ నియమించి జరిమానా నిధుల వినియోగంపై ప్రణాళిక రూపొందించాలని ఆదేశాల్లో వెల్లడించింది.