ఏపీలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గడంతో నేటి నుంచి కర్ఫ్యూను సడలించారు. రాష్ట్రంలో ఈ నెల 20 వరకు కర్ఫ్యూ ఆంక్షలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇవాళ్టి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది. ఇక నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ వేళల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
నిన్నటి వరకు ఏపీలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే షాపులు తెరుచుకునేందుకు.. నిత్యావసరాల కోసం ప్రజలు బయటకు వెళ్లేందుకు అనుమతి ఉండేది. అయితే, కరోనా కేసులు తగ్గడంతో మరో రెండు గంటల పాటు సమయాన్ని ప్రభుత్వం పెంచింది. నేటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ సడలింపు అమలు అవుతోంది. ఈ నెల 20 వరకూ ప్రభుత్వ ఆదేశాలు అమలు కానున్నాయి. ఏపీలో అమలు చేస్తున్న కఠిన కర్ఫ్యూ మంచి ఫలితమిస్తోంది. కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. పది రోజుల కిందటి వరకు ఏపీలో 20 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి అయితే, ఇప్పుడు పది వేల లోపే కేసులు నమోదవుతున్నాయి.