Wednesday, November 20, 2024

అత్యాచార బాధితురాలికిచ్చిన చెక్కు బౌన్స్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన తాడేపల్లి అత్యాచార ఘటనలో బాధితురాలికి ప్రభుత్వం ఇచ్చిన చెక్కు చెల్లకపోవడం చర్చనీయాంశమైంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతున్న సమయంలో ప్రభుత్వం రెండు చెక్కులు ఇచ్చింది. రూ.5 లక్షల చెక్కును ఆ కుటుంబం మార్చుకుంది. దీనికి సంబంధించిన నగదు వారి ఖాతాలో జమ అయింది. దీంతో పాటు గుంటూరు ఐసీడీఎస్‌ అధికారులు రూ.25వేల చెక్కు ఇచ్చారు. బాధితురాలి కుటుంబ సభ్యులు బ్యాంకుకు వెళ్లి దానిని డిపాజిట్‌ చేశారు. అయితే, డబ్బులు జమ కాకపోవడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు బ్యాంక్ కు వెల్లి ఆరా తీశారు. అధికారులు ఇచ్చిన చెక్కు ఖాతాలో డబ్బు లేని కారణంగా చెక్కు చెల్లలేదని బ్యాంక్ సిబ్బంది చెప్పారు. దీంతో బుధవారం గుంటూరు ఐసీడీఎస్‌ అధికారులు బాధితురాలి కుటుంబీకులకు ఫోన్‌ చేసి.. ఒకట్రెండు రోజుల్లో డబ్బు వేస్తామన్నారని తెలిపారు. చెక్కు జారీ చేసిన ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతోనే చెల్లలేదని మరో ఖాతా నుంచి డబ్బు ఇవ్వనున్నట్లు ఐసీడీఎస్‌ అధికారులు వివరణ ఇచ్చారు.

గతనెల 19న గుంటూరు జిల్లా తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాబోయే భర్తతో కృష్ణానది పుష్కర ఘాట్​ వద్దకు వెళ్లిన సమయంలో ఇద్దరు దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. యువతిని తాళ్లతో కట్టేసి ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ ఘటనపై స్పందించిన ఏపీ ప్రభుత్వం… అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపింది. ప్రభుత్వం తరఫున బాధితురాలికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్నా నేటికీ నిందితులను పట్టుకోలేకపోయారు. అత్యాచార ఘటన సీఎం నివాసానికి సమీవంలో జరగడం, ఆధారాలున్నా నిందితులను పట్టుకోలేకపోవడం వంటి అంశాలు పోలీసులను విమర్శల పాలు చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement