Sunday, November 3, 2024

జ‌గ‌న్ పాల‌న‌పై గ‌వ‌ర్న‌ర్ క‌న్ను…నెల‌నెల నివేదిక‌ల‌కు ఆదేశం..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వ పాలనపై గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ దృష్టిసారించా రు. రాష్ట్ర ప్రభుత్వ పాలన, ఆర్థిక అంశాలపై విపక్ష పార్టీలు తరుచూ విమర్శలు చేస్తున్న నేపధ్యంలో కీలక శాఖల పనితీరుపై నెలవారీ నివేదికలు పంపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ కార్యాలయం ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వ నిఘాగా కొందరు అభివర్ణిస్తుం టే.. మరికొందరు మాత్రం గవర్నర్‌కు నెలవారీ నివేదికలు పంపడమనేది సాధారణ ప్రక్రియలో భాగమేనని చెపుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గత నెల 29న గవర్నర్‌ కార్యాలయం నుంచి పాలనాపరమైన అంశాలపై ప్రతినెలా నివేదిక పంపాలంటూ సాధారణ పరిపాలన శాఖకు లేఖ అందింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి నివేదిక పంపాల్సి ఉన్నందున ప్రతి నెలా 3లోగా ఆయా అంశాలపై నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. మరో రెండు రోజులు అదనపు సమయం తీసుకోవచ్చు తప్ప అంతకు మించి జాప్యం చేయవద్దంటూ ఆదేశించడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశం గా మారింది.

రాష్ట్రంలో ఇటీవల పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న తరుణంలో గవర్నర్‌ కార్యాలయం నుంచి ఈ తరహా ఆదేశా లు రావడం విశేషం. రాష్ట్రంలోని పరిస్థితులు, ప్రజల స్థితిగతులు, కీలక రంగాల్లో అభివృద్ధి వంటి అంశాపై గవర్నర్‌ కార్యాలయం నివేదిక కోరింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ ప్రాథాన్యతా స్కీముల వివరాలు అడిగారు. రాష్ట్రంలో నిత్యావసర ధరలు, ప్రజలపై ప్రభావం వంటి అంశాలను పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాల్లో సాధించిన వృద్ధిపై నివేదిక కోరారు. నీటి పారుదల రంగంలో పరిస్థితులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమంతో పాటు వైద్య సేవలు, సామాజిక ఫెన్షన్లు, నిత్యావసర సరుకుల పంపినీ, విద్యుత్‌ సరఫరా, ఇంధన రంగం వృద్ధి, వ్యవసాయ రంగంలో సంస్కరణలు, స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛాంధ్రప్రదేశ్‌, ఎస్సీ, ఎస్టీల కేసుల నమోదు వంటి పలు అంశాలపై గవర్నర్‌ కార్యాలయం నివేదిక కోరింది. రాష్ట్రంలో పేదలకు గృహ నిర్మాణం, పేదరిక నిర్మూలన చర్యలు, పిల్లలు, మహిళల సంక్షేమ పథకాలు, బాలికా విద్య, వికలాంగుల సంక్షేమం, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి చేపట్టిన చర్యలను ఆ నివేదికలో పొందుపరచాలన్నారు.

ఆరోపణల నేపధ్యంలో..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన సహా అన్ని పార్టీలు వేలెత్తి చూపుతున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందంటూ ఆయా పార్టీలు ప్రభుత్వంపై విమర్శులు సంధిస్తున్నారు. కొందరు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ క్రమంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం నిశితంగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో గవర్నర్‌ కార్యాలయం స్పందించడం కీలకంగా చెప్పొచ్చు. గత తెదేపా ప్రభుత్వంలో కూడా ఎన్నిలకు ముందు ఇదే తరహాలో గవర్నర్‌ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు చెపుతున్నారు. టీడీపీ, బీజేపీ కలిసి 2014లో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఎన్నికలకు ఏడాది ముందు రెండు పార్టీల మధ్య సఖ్యత చెడింది. అటు కేంద్రం నుంచి టీడీపీ, ఇటు రాష్ట్రం నుంచి బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం నుంచి తప్పుకున్నాయి. ఈ క్రమంలోనే అప్పటి గవర్నర్‌ ప్రభుత్వ పాలనాంశాలపై నెలవారీ నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించినప్పటికీ తదనంతర కాలంలో పెద్దగా పట్టించుకోలేదని చెపుతున్నారు. రాష్ట్ర గవర్నర్‌గా ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ గత నెలలోనే బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు నేరుగా ప్రభుత్వ పాలనాంశాలపై గవర్నర్‌ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

కట్టడిలో భాగమా? పురోగతి తెలుసుకునేందుకా?..
రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, ప్రాథాన్యతలు, పాలనాపరమైన అంశాలపై గవర్నర్‌ కార్యాలయం నెలవారీ నివేదిక కోరడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది సాధారణ వ్యవహారంగానే కొందరు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై గవర్నర్‌ నివేదిక ఇవ్వడమనేది పాలనాపరమైన అంశంలో భాగమేనని చెపుతున్నారు. అయితే వివిధ రాజకీయ పార్టీల నుంచి ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో పథకాలు దుర్వినియోగం కాకుండా కట్టడి చేయడంలో భాగమని భావిస్తున్నారు. మరో వైపు పొరుగు రాష్ట్రాల్లో తరుచూ ప్రభుత్వం, గవర్నర్ల మధ్య పేచీలు తలెత్తుతున్న నేపధ్యంలో ఈతరహా ఘటనలకు ఆస్కారం లేకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకోవడంలో భాగమై ఉండొచ్చంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement