విజయవాడ – భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని.. ప్రభుత్వ అధికారుల సహాయంతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి వెళ్లవద్దని గవర్నర్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు..
ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారు ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని కోరారు. రెడ్‌క్రాస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇతర ఎన్‌జీవోలు ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. బాధితులకు ఆహారం, మందులు, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీలో రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్‌లలో చురుకుగా పాల్గొనాలని అధికారులను, స్వచ్చంద సేవ సంస్థలకు ఆయన పిలుపు ఇచ్చారు.. ఇక, విజయవాడతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వర్షాల కారణంగా సంభవించిన ప్రాణనష్టంపై గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.