Tuesday, November 19, 2024

Ap | గుడ్‌న్యూస్.. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు..

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రాలను అందజేశారు. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ ఈస్ట్రన్ బైపాస్, రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు, బెజవాడలో ఫ్లైఓవర్‌ నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు చర్చించారు. దీనిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని విజయవాడ ఎంపీ, కేశినేని శివనాథ్ వెల్లడించారు.

విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్డుకు గడ్కరీ అనుమతి ఇచ్చారని ఎంపీ కేశినేని శివనాధ్ తెలిపారు. అలాగే, రాజధాని ఔటర్ రింగ్ రోడ్డుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. బెజవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు కూడా ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. వీటికి సంబంధించి తగిన ఉత్తర్వులు త్వరలోనే వెలువరిస్తామని హామీ ఇచ్చారని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు.

కాగా, 189 కి.మీ. పొడవైన ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని 87 గ్రామాలను అనుసంధానించేలా 150 మీటర్ల వెడల్పుతో నాలుగు వరసల్లో నిర్మించేలా గతంలోనే ఆర్‌అండ్‌బీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాజధానికి ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తామని 2015లోనే చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు ఆర్వీ అసోసియేట్స్‌తో డీపీఆర్ కూడా రూపొందించారు. ఓఆర్ఆర్ కోసం 3,400 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని, భూ సేకరణకు రూ.4 వేల కోట్లు అవసరమని అప్పట్లో అంచనా వేశారు.

భూ సేకరణ సహా నిర్మాణం పూర్తవ్వాలంటే మొత్తం రూ.17,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా.. భారత మాల ప్రాజెక్టు కింద నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది కూడా. కానీ, తర్వాత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి.. వైఎస్ జగన్ అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టును పక్కనబెట్టారు. మళ్లీ చంద్రబాబు సీఎం కావడంతో కదలిక వచ్చింది. అయితే, ప్రస్తుత ధరల ప్రకారం ఈ అంచనాలు పెరిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement