అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ తొలి రోజు సూపర్ సక్సెస్ అయింది. అంచనాలకు మించి దేశ విదేశాల నుండి పారిశ్రామిక వేత్తలు తరలిరావడం జగన్ సర్కార్ ఆశయాలకు అనుగుణంగా పెట్టుబడులను ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం కూడా దాదాపుగా నెరవేరినట్లయింది. రెండు రోజులపాటు విశాఖ వేదికగా ప్రారంభమైన సదస్సులో తొలి రోజే భారీ పెట్టుబడులు రావడం, ఆ దిశగానే ఒప్పందాలు కూడా పూర్తికావడంతో రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున భారీ పరిశ్రమలు అందుబాటులోకి రాబోతున్నాయి. దీంతో సీఎం జగన్‌తోపాటు ప్రభుత్వ పెద్దల్లో కూడా రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. సదస్సుకు ముందు ప్రభుత్వం అంచనావేసిన విధంగా పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు రావడంతో తొలి రోజు సమ్మిట్ నూటికి నూరు శాతం విజయ వంతం అయినట్లయింది. అయితే, పెట్టుబడులతో పాటు దేశ విదేశాల నుండి తరలివచ్చిన పారిశ్రామిక వేత్తలకు ఘనమైన ఏర్పాట్లు చేపట్టడంలోనూ వారికి స్వాగత సత్కారాలు నిర్వహించడం లోనూ రాష్ట్ర ప్రభుత్వం దావోస్ సదస్సును తలపించేలా ఏర్పాట్లు చేపట్టింది. ముఖేష్ అంబానీ లాంటి పారిశ్రామిక వేత్తలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా స్వాగతం పలికారంటే సమ్మిట్ ఏస్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అసవరం లేదు. అతిథులకు అంతకుమించిన ఆత్మీయ స్వాగతం కూడా లభించింది. విమానాశ్రయం నుండి కొంత మంది పారిశ్రామికవేత్తలు నేరుగా సభా ప్రారంగణానికి చేరుకోగా మరికొంత మంది ప్రతినిధులు హోటల్ నుండి సభా వేదిక వద్దకు ఒక్కొక్కరిగా చేరుకునే క్రమంలో మంత్రుల బృందం వారికి దగ్గరుండి ఆత్మీయ స్వాగతాన్ని పలికింది. అదేవిధంగా సభలో ప్రసంగాలతోపాటు సదస్సు ప్రారంభానికి ముందు ఆయా దేశాల విదేశాల నుండి హాజరైన ప్రముఖులను సీఎం జగన్ పేరుపేరునా ఆప్యాయంగా పలుకరించారు. జ్యోతి ప్రజ్వలన కు ముందు ఉత్తరాంధ్ర కట్టుబొట్టుతో గిరిజన మహిళలు చేసిన నృత్యం విదేశీపారిశ్రామికవేత్తలను ఆకట్టుకున్నాయి.
12 మంది దేశీయ వ్యాపారవేత్తలు .. ముగ్గురు విదేశీ పారిశ్రామికవేత్తలు
శుక్రవారం విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగిన పెట్టుబడుల పండుగకు దేశ విదేశాల నుండి ప్రముఖులు హాజరయ్యారు. ప్రత్యేకించి ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ వివిధ సందర్బాల్లో గతంలో రాష్ట్రానికి వచ్చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన పారిశ్రామిక సదస్సుకు హాజరుకావడం ఇదే తొలిసారి. ముఖేష్‌తోపాటు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్ధ రిలయన్స్‌కు చెందిన 12 మంది డైరెక్టర్లను కూడా తన వెంట తీసుకురావడం తొలి రోజు హైలైట్‌గా నిలిచింది. మొత్తం మీద శుక్రవారం అంచనాలకు మించి పారిశ్రామికవేత్తలు సదస్సుకు తరలివచ్చినప్పటికీ 15 మంది పారిశ్రామికవేత్తలు తొలిరోజు సదస్సులో ప్రసంగించడంతోపాటు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపారు. ఆదిశగా కొన్ని ఒప్పందాలు కూడా జరిగాయి. వారిలో 12 మంది స్వదేశానికి చెందిన దిగ్గజాలు కాగా ముగ్గురు విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు వారంతా తమతమ సంస్తల ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతోపాటు రాష్ట్రప్రభుత్వం స్థానికంగా ఏర్పాటుచేస్తున్న మౌలిక సదుపాయాల గురించి తమతమ ప్రసంగాల్లో స్పష్టంగా వివరించారు. ఆసందర్భంలో సీఎం జగన్ ముఖంలో చిరునవ్వులు కనిపించాయి.
దావోస్‌ను మరిపించిన సమ్మిట్
రాష్ట్రంలో మరిన్ని భారీ పరిశ్రమలను నెలకొల్పే ప్రక్రియలో భాగంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం దావోస్‌లో సదస్సు నిర్వహించింది. ఆసమయంలో ఆకార్యక్రమం హైలైట్‌గా నిలవడంతోపాటు ప్రపంచ దేశాల్లో చర్చ కూడా నడిచింది. అయితే, తాజాగా విశాఖ వేదికగా జరుగుతున్న పెట్టుబడుల సదస్సు దావోస్‌ను మరిపించేలా జగన్ సర్కార్ ఏర్పాట్లను చేపట్టింది. దీంతో వివిధ దేశాల నుండి వచ్చిన పారిశ్రామికవేత్తలు మౌలిక సదుపాయాలకంటే ప్రభుత్వం ఏర్పాటుచేసిన సభా ప్రాంగణం ఏర్పాట్లు వారిని ఎక్కువగా మరిపించింది. దీంతో తొలిరోజే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉప్పెనలా పెట్టుబడులు వచ్చాయి.
అథిధులకు ఆత్మీయ స్వాగతాలు
విశాఖ వేదికగా రెండు రోజులపాటు జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు కొంత మంది పారిశ్రామికవేత్తలు గురువారం రాత్రికే విశాఖకు చేరుకున్నారు. మరికొంతమంది శుక్రవారం తెల్లవారుఝామునుండి ఒక్కొక్కరుగా నగరానికి చేరుకున్నారు. అనంతరం వారికి కేటాయించిన హోటల్స్‌కు చేరుకుని అక్కడి నుండి తమ ప్రతినిధుల బృందంతో సభా ప్రాంగణానికి తరలివచ్చారు. అయితే, సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ప్రతి పారిశ్రామికవేత్తను ఐదు మంది మంత్రుల బృందం దగ్గరుండి ఒక్కొక్కరికి ఆత్మీయంగా స్వాగతం పలికారు. మరో ఇద్దరు మంత్రులు వారి వెన్నంటే నడిచి సభాప్రాంగణం వరకూ స్వాగతం పలుకుతూ తీసుకెళ్లారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయాలను దేశ విదేశాలకు మరోసారి చాటిచెప్పేలా స్వాగత ఏర్పాట్లను చేపట్టారు.
అదరగొట్టిన ఆంధ్రా వంటకాలు
సుదీర్ఘంగా సాగిన సదస్సులో ముఖ్య అతిథులతోపాటు దేశ విదేశాల నుండి వచ్చిన పారిశ్రామికవేత్తలకు ఆంధ్రా వంటకాలు నోరూరించాయి. సీఎం జగన్ అతిథులకు రుచికరమైన వంటలు ఏర్పాటు చేయడంలో ముందునుంచే పక్కా ప్రణాళికతో అన్ని రకాల వంటలను అందుబాటులో ఉండేలా చూశారు. దీంతో సదస్సుకు వచ్చిన పారిశ్రామికవేత్తలతోపాటు ఆయా దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం ఔరా ఆంధ్రా వంటకాలు అంటూ కితాబిచ్చారు. ప్రత్యేకించి బొమ్మిడాయిల పులుసు హైలైట్‌గా నిలిచింది.