Monday, November 25, 2024

AP – విశాఖ తీరంలో పాక్ జలాంతర్గామి ఘాజీ శకలాలు గుర్తింపు ..

విశాఖపట్నం – 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో బంగాళాఖాతంలోకి విశాఖపట్టణం వరకుచొచ్చుకొచ్చి భారత్‌ను దొంగదెబ్బ తీయాలని ప్రయత్నించి చావుదెబ్బలు తిన్న పాక్ జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీ శకలాలను భారత నౌకాదళం గుర్తించింది. ఇండియన్ నేవీలోని సబ్‌మెరైన్ రెస్క్యూ విభాగం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి వీటిని గుర్తించింది. భారత అమ్ములపొదిలోకి ఇటీవల వచ్చి చేరిన ‘ది డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ (డీఎస్ఆర్‌వీ) సాయంతో ఈ శకలాలను కనుగొన్నారు. విశాఖపట్టణం తీరానికి దాదాపు 2.5 కిలోమీటర్ల దూరంలోని సముద్ర గర్భంలో 100 మీటర్ల లోతున శకలాలు ఉన్నట్టు గుర్తించారు. అయితే, యుద్ధంలో చనిపోయిన వారిని గౌరవించడం మన నౌకాదళ ఆచారం కావడంతో వాటిని తాకలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

2013లో ఐఎన్ఎస్ సింధ్‌రక్షక్ ప్రమాదానికి గురై 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాల సమయంలో సిబ్బందిని రక్షించేందుకు వీలుగా 2018లో తొలిసారి డీఎస్ఆర్‌వీ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. నౌకలు, జలాంతర్గాములు ప్రమాదానికి గురైనప్పుడు వాటిని గుర్తించి సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ సాంకేతికతను ఉపయోగిస్తారు. ప్రస్తుతం నేవీ వద్ద రెండు డీఎస్ఆర్‌వీలు అందుబాటులో ఉన్నాయి. నౌకలు, విమానాల ద్వారా దీనిని తరలించవచ్చు. భారత్ సహా 12 దేశాల వద్ద మాత్రమే ప్రస్తుతానికి ఇలాంటి సాంకేతికత అందుబాటులో ఉంది. డీఆర్ఎస్‌వీ 650 మీటర్ల దిగువకు వెళ్లి పనిచేసే సామర్థ్యం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement