Tuesday, November 26, 2024

AP | ఆర్టీసీ ఉద్యోగుల‌కు గెజిటెడ్ హోదా…

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులు, అధికారులకు గెజిటెడ్ హోదా కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు జీఓ ఎంఎస్ నంబర్ 39 పేరుతో ఏపీ రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీఎస్ఆర్టీసీ (పబ్లిక్ సర్వీసెస్‌లో ఉద్యోగుల ఇంటిగ్రేషన్) చట్టం-2019ని “ప్రజా రవాణా శాఖ”గా నియమించినట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. 2020 జనవరి 1 నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినట్లు స్పష్టం చేశారు.

కాగా, ఉద్యోగులు, అధికారులకు ఇచ్చే గెజిటెడ్ హోదాను ఐదు రకాలుగా విభజించారు.

  1. అసిస్టెంట్ మేనేజర్‌లు (ఫైనాన్స్, ట్రాఫిక్, పర్సనల్, స్టాటిస్టిక్స్, మెటీరియల్స్ కొనుగోలు), నర్సింగ్ సూపరింటెండెంట్, చీఫ్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఇంజనీర్లు (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్)లకు లెవల్-1 గెజిటెడ్ హోదా.
  2. జూనియర్ స్కేల్ సర్వీస్ ఉద్యోగులకు లెవెల్-2 గెజిటెడ్ హోదా.
  3. సీనియర్ స్కేల్ సర్వీస్ ఉద్యోగులకు (డివిజనల్ మేనేజర్, తత్సమాన పోస్టులు) లెవెల్-3 గెజిటెడ్ హోదా.
  4. స్పెషల్ స్కేల్ సర్వీస్ ఉద్యోగులకు (రీజినల్ మేనేజర్, తత్సమాన పోస్టులు) లెవెల్-4 గెజిటెడ్ హోదా.
  5. సూపర్ స్కేల్ సర్వీస్ ఉద్యోగులకు (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) లెవెల్-5 గెజిటెడ్ హోదా.

ప్రజా రవాణా శాఖ కమిషనర్ తదుపరి చర్యలు తీసుకోవాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement