ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులు, అధికారులకు గెజిటెడ్ హోదా కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు జీఓ ఎంఎస్ నంబర్ 39 పేరుతో ఏపీ రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీఎస్ఆర్టీసీ (పబ్లిక్ సర్వీసెస్‌లో ఉద్యోగుల ఇంటిగ్రేషన్) చట్టం-2019ని “ప్రజా రవాణా శాఖ”గా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2020 జనవరి 1 నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినట్లు స్పష్టం చేశారు.
కాగా, ఉద్యోగులు, అధికారులకు ఇచ్చే గెజిటెడ్ హోదాను ఐదు రకాలుగా విభజించారు.
- అసిస్టెంట్ మేనేజర్‌లు (ఫైనాన్స్, ట్రాఫిక్, పర్సనల్, స్టాటిస్టిక్స్, మెటీరియల్స్ కొనుగోలు), నర్సింగ్ సూపరింటెండెంట్, చీఫ్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఇంజనీర్లు (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్)లకు లెవల్-1 గెజిటెడ్ హోదా.
- జూనియర్ స్కేల్ సర్వీస్ ఉద్యోగులకు లెవెల్-2 గెజిటెడ్ హోదా.
- సీనియర్ స్కేల్ సర్వీస్ ఉద్యోగులకు (డివిజనల్ మేనేజర్, తత్సమాన పోస్టులు) లెవెల్-3 గెజిటెడ్ హోదా.
- స్పెషల్ స్కేల్ సర్వీస్ ఉద్యోగులకు (రీజినల్ మేనేజర్, తత్సమాన పోస్టులు) లెవెల్-4 గెజిటెడ్ హోదా.
- సూపర్ స్కేల్ సర్వీస్ ఉద్యోగులకు (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) లెవెల్-5 గెజిటెడ్ హోదా.
ప్రజా రవాణా శాఖ కమిషనర్ తదుపరి చర్యలు తీసుకోవాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.