తెలంగాణలో వారంలోనే ప్రారంభించారు
ఆరు పథకాల్లో నాలుగు మహిళలకే
ఏటా ₹300 కోట్ల ఖర్చుకు భయపడుతున్నారా
ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పుడిస్తారు
తెనాలి పల్లెవెలుగు బస్సులో పీసీసీ చీఫ్ షర్మిల జర్నీ
పోస్టు కార్డు ద్వారా సీఎం చంద్రబాబుకు పలు ప్రశ్నలు
మహిళల భద్రతకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఆంధ్రప్రభ స్మార్ట్, ఎన్డీఆర్ జిల్లా బ్యూరో :
అధికారంలో వచ్చి నాలుగు నెలలు అయింది, అయినా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై సీఎం చంద్రబాబు ఇంత వరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని పీసీసీ చీఫ్ షర్మిల ప్రశించారు. ఉచిత ప్రయాణం అమలు చేయాలని చంద్రబాబుకు పోస్ట్ కార్డు రాశారు. శుక్రవారం విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి వెళ్లే పల్లెవెలుగు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉచిత ప్రయాణం ఇంకెప్పుడు అని మహిళలు అడుగుతున్నారని నిలదీశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వారంలోనే మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేశారని, ఈ పథకాన్ని అమలు చేయడానికి ఇబ్బందులు ఏమిటని ప్రశ్నించారు. ఆర్టీసీ కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని పట్టించు కోవటం లేదా? అన్నారు. రాష్ట్రంలో రోజూ 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని, రోజూ మహిళల ద్వారా ₹7 కోట్ల చొప్పున.. నెలకు ₹300 కోట్లు ఆదాయం ఆర్టీసీకి వస్తోందన్నారు.
అయిదేండ్లు ఇలానే కాలయాపన చేస్తారా?
మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే.. ఈ ₹300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాల్సి వస్తుందని భయపడుతున్నారా? అని సీఎం చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. ఎన్నికల్లో మహిళలకు హామీ ఇచ్చారు, ఓట్లు తీసుకున్నారు, ఇప్పుడు మహిళల కోసం ₹300 కోట్లు ఖర్చు చేయలేరా ? అన్నారు. మీ సూపర్ సిక్స్ హామీల్లో 4 పథకాలు మహిళలవేనని, ఇందులో ఉచిత ప్రయాణం ఒక్కటే తక్కువ ఖర్చు, ఇలాంటి తక్కువ ఖర్చు పథకాన్ని అమలు చేయడానికి ధైర్యం రావడం లేదన్నారు. మీకు ఇష్టం వచ్చినప్పుడు అమలు చేస్తారా ? ఇదే అమలు చేయనప్పుడు ఇక పెద్ద పథకాల సంగతి ఏంటి? మరో ఐదేళ్లు ఇలానే కాలయాపన చేస్తారా ? ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలు అడుగుతున్నారని షర్మిల ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు.
మహిళల భద్రతకు చర్యలు తీసుకోవాలి..
ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు భద్రత ఉంటుందని, అందుకే ఎంతో మంది మహిళలు బస్సులను ఆశ్రయిస్తారని, ఇది చాలా మంచి పథకమని షర్మిల అన్నారు. వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబును డిమాండు చేశారు. మహిళల కోసం పెట్టిన పథకాలను తక్షణమే అమలు చేయాలని, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని డిమాండు చేశారు. ఇప్పటికే మార్కెట్లో అన్ని సరుకుల ధరలు పెరిగాయని, మహిళల మీద భారం పడుతుందని, ఈ స్థితిలో మహిళలకు భరోసా కావాలన్నారు. మహిళలకు భద్రత విషయంలో ముందడుగు పడాలని, రాష్ట్రంలో నెల రోజుల్లో హత్యాచారాలు మీద రిపోర్ట్ తీశామని, అన్ని పత్రికల నుంచి ఆర్టికల్స్ సేకరించామన్నారు. ఇక మద్యం ధరలు తగ్గించారు.. ₹99 కే మద్యం ఇస్తే.. మహిళల మీద హత్యాచారాలు పెరుగుతాయన్నారు.