Saturday, December 21, 2024

AP – మినీ వ్యాన్ తో లారీ ఢీ – నలుగురు దుర్మరణం ..

శ్రీ సత్యసాయి బ్యూరో, డిసెంబర్ 21(ఆంధ్రప్రభ): దైవ దర్శనానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా మడకశిర మండలం బుల్లసముద్రం గ్రామ సమీపంలో నిలబడిన లారీని టెంపో ట్రావెల్ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం వేకువజామున ఐదు గంటల సమయంలో మడకశిర మండలం బుళ్ళ సముద్రం వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం కుంభరనాగేపల్లి గ్రామానికి చెందిన శివరాజు, ప్రేమ్ కుమారి దంపతులకు చెందిన ఆధర్వ (2)తలనీలాలు సమర్పించడానికి గురువారం స్వగ్రామమైన కుంభరనాగేపల్లి నుండి బంధువులతో కలిసి ప్రత్యేక వాహనంలో తిరుపతికి వెళ్లారు. అక్కడ దేవుని కార్యక్రమం ముగించుకుని శుక్రవారం రాత్రి స్వగ్రామానికి బయలుదేరారు.

మరో 40 నిమిషాలలో వారి స్వగ్రామానికి చేరుకోవలసిఉండగా అంతలోనే వారిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబలించడంతో మడకశిర నియోజకవర్గంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. బుల్లసముద్రం గ్రామం సమీపంలో ప్రధాన రహదారి పక్కన నిలబడి ఉన్న సిమెంట్ లారీని టెంపో ట్రావెల్ ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రేమకుమారి (30), అథర్వ(2), రత్నమ్మ (70), డ్రైవర్ మనోజ్ (30) నలుగురు మృతిచెందారు. మృతిచెందిన వారిలో తల్లి ప్రేమ, కుమారుడు ఆథర్వ, గుడిబండ మండలం కుంబర్ నాగేపల్లి గ్రామానికి చెందినవారు. వీరి బంధువు రత్నమ్మ అమరాపురంకు చెందినవారు డ్రైవర్ మనోజ్ పావగడ తాలూకా నిడిగల్లు పంచాయతీ కొండాపురం గ్రామానికి చెందిన వాడని పోలీసులు గుర్తించారు.

ఈ సంఘటన జరిగిన వెంటనే అటువైపు వెళుతున్న వాహనదారులు చూసి వెంటనే 108కు సమాచారం ఇవ్వడంతో పాటు ఆ గ్రామ సమీపంలో గల ఆటోలలో గాయపడ్డ వారిని మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారికి వైద్య సిబ్బంది ప్రథమ చికిత్సలు నిర్వహించారు. టెంపో ట్రావెల్ లో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు మృతిచెందగా మరో 10మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో సుజాతమ్మతో పాటు మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తుమకూరు ప్రాంతాలకు తరలించారు. మరో నలుగురికి కాళ్లు, చేతులు దెబ్బతినడంతో వారిని సైతం చికిత్స కోసం తుంకూర్ కు తరలించారు. అయితే డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ఈ సంఘటన ఆ గ్రామ ప్రజలకు బంధువులకు తెలియడంతో వారు హుటాహుటిన మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని గాయపడ్డ వారిని చూసి ఆసుపత్రిలో రోదనలు మిన్నంటాయి. ఈ విషయం తెలుసుకున్న మడకశిర పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

- Advertisement -

బంధువులను పరామర్శించి,ఓదార్చిన ఎస్పీ వి. రత్న….

మడకశిర మండలం బుల్లసముద్రం గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ రత్న, ఏఐసిసి సభ్యుడు రఘువీరారెడ్డి, టిడిపిమాజీ ఎమ్మెల్యే ఈరన్న, న్యాయవాది రాధాకృష్ణ , వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త ఈరలకప్ప పలువురు రాజకీయ నాయకులు సైతం పరామర్శించి ఓదార్చారు. అనంతరం జిల్లా ఎస్పీ రత్న పాత్రికేయులతో మాట్లాడుతూ మడకశిర ప్రాంతంలో శనివారం వేకువజమున జరిగిన రోడ్డు ప్రమాదం తీవ బాధాకరమన్నారు. ముఖ్యంగా డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం జరగడం జరిగిందని అతను అందులో ప్రయాణిస్తున్న వారు చెప్పినట్లు కొంతసేపు వాహనాన్ని నిలిపివేసి తీసుకొని బయలుదేరి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. దానికి తోడు చలికాలం మూలంగా పొగ మంచు కమ్ముకొని ఉండడంతో రహదారి కూడా కనిపించకపోయి ఉండడంతోనే వాహనాన్ని లారీకి ఢీకొట్టడం జరిగింది అని ఆమె పేర్కొన్నారు.

ముఖ్యంగా వాహన డ్రైవర్లు అర్ధరాత్రి రెండు గంటల నుండి వేకువజం ఐదు గంటల వరకు వాహనాలు నడప సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఎందుకంటే అది మంచి నిద్ర సమయం కాబట్టి ఆ సమయంలో నిద్ర రావడంతో వాహనాలు ప్రమాదాలకు గురవుతుంటాయని కావున ఈ విషయంలో జాగ్రత్తలు డ్రైవర్లు పాటించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత ఆరు నెలల కాలంలో సత్యసాయి జిల్లాలో ఇలాంటి పెద్ద ప్రమాదం చోటు చేసుకోవడం ఇదే మొదటిదని ఆమె పేర్కొన్నారు. అనంతరం ఆమె మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచిన మృతుల మృతదేహాలను పరిశీలించడం తో పాటు ఆస్పత్రిలో చికిత్స గంగమ్మ అనే మహిళను పరామర్శించి ప్రమాదం గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రాబోవు రోజుల్లో జాతీయ రహదారులపై ప్రమాదాలను నివారించే విధంగా తమ శాఖ ఆధ్వర్యంలో వాహన డ్రైవర్లకు ప్రత్యేకంగా అవగాహన కల్పించడం జరుగుతుందని డ్రైవర్లు పోలీసుల సూచనలు పాటించి ప్రమాదాల జరగకుండా కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందని ఆమె పేర్కొన్నారు. ఈమె వెంట పెనుగొండ డిఎస్పి వెంకటేశ్వర్లు స్థానిక సీఐ రాజకుమార్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement