రెండు రోజుల ముందే రిటైర్మెంట్
కొత్త బాద్యతలు స్వీకరించిన రోజే సెండాఫ్
అమరావతి – ఎపిలో నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు శుక్రవారం పదవీ విరమణ చేశారు. మాజీ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డితో పాటు పూనం మాలకొండయ్య, కె.వెంకటరమణారెడ్డి, హెచ్.అరుణ్‌కుమార్ రిటైరయ్యారు. ఈ నెల 30వ తేదీతో వారికి 60 ఏళ్లు పూర్తవుతాయి. 29, 30 తేదీలు శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో రెండ్రోజుల ముందే వారు పదవీ విరమణ చేశారు. సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త పోస్టింగ్ తీసుకున్న రోజే..
కాగా పదవీ విరమణ నేపథ్యంలో జవహర్ రెడ్డి, పూనంకు ప్రభుత్వం గురువారం పోస్టింగ్‌లు ఇచ్చింది. దీంతో వారిద్దరూ శుక్రవారం ఆ శాఖల బాధ్యతలు స్వీకరించి ఆ సాయంత్రం పదవీ విరమణ చేశారు. ఇక ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ తీసుకున్న జవహర్‌రెడ్డి రిటైర్ కావడంతో ఇన్‌చార్జిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాముకు అదనపు బాధ్యతలు అప్పగించారు. జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న పూనం మాలకొండయ్య స్థానంలో పోలా భాస్కర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. సివిల్ సప్లయ్స్ కమిషనర్‌గా ఉన్న హెచ్.అరుణ్‌కుమార్‌ను ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు.