Sunday, November 17, 2024

AP – కృష్ణమ్మకు జలకళ – ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద నీరు..

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో)

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కురుస్తున్న వర్షాలకు తోడు, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలతో పడుతున్న వర్షాలకు కృష్ణా నదికి వరద నీరు పెద్ద ఎత్తున పోటెత్తితోంది. గడిచిన 72 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరంతా కృష్ణానదిలో కలుస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వచ్చి చేరుతుంది. గంట, గంటకు పెరుగుతున్న వరద ఉధృతితో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నిండు కుండను తలపిస్తోంది. బ్యారేజి పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 12 అడుగులకు నీటిమట్టం చేరుకున్న నేపథ్యంలో ఇన్ ఫ్లో పెరుగుతున్న తరుణంలో అధికారులు శనివారం ఉదయం 7:15 నిమిషాలకు బ్యారేజీ గేట్లను ఎత్తి దిగువకు మిగులు జలాలను విడుదల చేస్తున్నారు.

- Advertisement -

బ్యారేజీ మొత్తం 70 గేట్లలో 4 గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు 2,920 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ప్రస్తుతం కృష్ణా నదికి 10 గంటల సమయానికి 7419 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, సముద్రంలోకి 5840 క్యూసెక్కులు, కృష్ణ డెల్టా తూర్పు, పశ్చిమ కాలువలకు మరో 1309 క్యూసెక్కుల నీటిని సాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నారు. బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు గంట గంటకు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు, నదీ పరివాహక ప్రాంతాలతో పాటు, కృష్ణానది దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement