ఆంధ్రప్రభ స్మార్ట్, గుంటూరు ( ఏఎన్ యూ క్యాంపస్): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకుల పతి ఆచార్య పి.రాజశేఖర్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని, మూడు రాజధానులకు మద్దతుగా విశ్వవిద్యాలయంలో సదస్సు నిర్వహించినందుకు రాజధాని రైతులకు క్షమాపణ చెప్పాలంటూ బుధవారం రాజధాని రైతులు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఉపకులపతి కార్యాలయాన్ని ముట్టడించారు. తొలుత టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, రాజధాని రైతులు విశ్వవిద్యాలయంలో ప్రదర్శన నిర్వహించారు. వర్సిటీ ప్రాంగణాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చారని ఉపకులపతిని విమర్శించారు.
ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, రాజధాని రైతులు ఉపకులపతి కార్యాలయంలోనికి వెళ్లడానికి ప్రయత్నించారు. భద్రత సిబ్బంది, పోలీసుల సహాయంతో ఉపకులపతి తన కార్యాలయం తలుపులు మూసుకొన్నారు. ఆందోళనకారులు లోనికి రాకుండా ప్రయత్నించారు. అయినను నాయకులు, రాజధాని రైతులు కార్యాలయం తలుపులు నెట్టుకుంటూ లోనికి వెళ్లి ఉపకులపతిని చుట్టుముట్టారు. విద్యకు నిలయమైన విశ్వవిద్యాలయాన్ని వైసీపీ నిలయంగా ఎందుకు మార్చారని, మూడు రాజధానులకు మద్దతుగా సదస్సు పెట్టినందుకు వెంటనే పదవికి రాజీనామా చేయాలంటూ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు భాగ్యరాజ్, ఏఎన్యూ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు నితీష్ యాదవ్ నిలదీశారు.
ఈ ఆందోళనలో గుంటూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, టీడీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, జయరామిరెడ్డి, ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు నాసరయ్య పాల్గొన్నారు.