మన్యం పర్యటనలో పవన్ క్లోజ్ గా తిరిగిన అనామకుడు
ఐపిఎస్ డ్రస్ ఉండటంతో అనుమానించని పోలీసులు
పర్యటన చివరిలో అతడి కదలికలపై అనుమానం
ఆ వెంటనే ఆ నకిలీ ఐపిఎస్ పరార్
హైదరాబాద్ కు కారులో పారిపోతుండగా పట్టివేత
సమగ్ర విచారణకు హోం మంత్రి అనిత ఆదేశం
వెలగపూడి – ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం బయటపడింది. ఐపీఎస్ యూనిఫారంతో పవన్ కల్యాణ్ వెంటే పర్యటన అసాంతం ఉండటం సంచలనం కలిగించింది. ఆలస్యంగా గుర్తించిన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాలలోకి వెళితే, విజయనగరం జిల్లా ముడిదాం ప్రాంతానికి చెందిన సూర్య ప్రకాష్ గత ఏడాదే ఐపీఎస్ కు సెలక్ట్ అయ్యానని స్థానికులకు చెప్పాడు. ట్రైనింగ్ లో ఉన్న తాను ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పర్యటన కోసం వచ్చానని చెప్పుకున్నాడు. ఐపిఎస్ అధికారి డ్రస్ లో పవన్ పర్యటనలో పాల్గొన్నాడు.. అతడి కదలికలపై అనుమానం రావడంతో పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులకు చిక్కకుండా విజయనగరం పారిపోయాడు.. అక్కడ నుంచి కారులో హైదరాబాద్ వెళుతుండగా విజయనగరం సరిహద్దులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, సూర్య ప్రకాష్ గతంలో పార్వతీపురం డివిజన్ తూనుకలు కొలతలు విభాగంలో లైసెన్స్డ్ రిపేరర్ గా పని చేశాడు. అతడిపై కేసు నమోదు చేశారు పోలీసులు..
హోం మంత్రి ఆగ్రహం ..
విజయనగరం జిల్లాలో నకిలీ ఐపీఎస్ అధికారి ఉండటంపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తక్షణమే విచారణకు ఆదేశించారు. అలాగే, వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతలో జరుగుతున్న లోపాలను దర్యాప్తు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.