ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మళ్లీ ఫోకస్ పెడుతోంది.. అందులో భాగంగా..
ప్రాజెక్టులో ఉన్న ఇబ్బందులను అదిగమించే ప్రయత్నాలు చేస్తోంది.. దీనికోసం విదేశీ నిపుణులను రంగంలోకి దింపింది.. ఇక, ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో విదేశీ నిపుణుల బృందం మూడో రోజైన నేడు కూడా వారి పర్యటన కొనసాగుతుంది.
ప్రాజెక్టు నిర్మాణంలో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలకు పరిష్కారం చూపేందుకు రెండు రోజుల నుంచి విదేశీ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటిస్తోంది. గత రెండు రోజులపాటు పోలవరం ప్రాజెక్టులోని కీలక నిర్మాణాలను పరిశీలించిన బృందం మూడవ రోజు ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో అంతర్జాతీయ నిపుణులబృందం మూడో రోజు డీ వాల్ నిర్మాణ ప్రాంతంలో సేకరించిన మట్టిని రాతిని పరిశీలించారు. మరిన్ని నమూనాల పరిశీలన అనంతరం జలవనరుల శాఖ అధికారులతో నిపుణుల బృందం చర్చించనుంది.
ఇక పోలవరం ప్రాజెక్టు పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన అంతర్జాతీయ నిపుణులు అనేక అంశాలు ప్రస్తావించారు. వాటిపై అక్కడ ఉన్న కేంద్ర జలసంఘం నిపుణులు, అఫ్రి డిజైన్ సంస్థ ప్రతినిధులు, స్థానిక ఇంజినీరింగ్ అధికారులు, ఇతర సంస్థల ప్రతినిధులు ఇచ్చే సమాధానాలు వింటూ వారి అనుమానాలను నివృత్తి చేస్తూ ముందుకు సాగుతున్నారు.
అలాగే , ఈరోజు, రేపు ప్రాజెక్టు పనులకు సంబంధించి పలు వివరాలు సేకరించిన అనంతరం నిపుణుల బృందం తుది నివేదికను అందించనుంది. గత రెండు రోజులుగా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో పర్యటించి ఎగువ , దిగువ కాపర్ డ్యాం, డి వాల్, పనులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న బృందం ఆయా పనులకు సంబంధించిన వివరాలను జల వనరుల శాఖ అధికారుల నుండి సేకరిస్తున్నారు.
డయాఫ్రం వాల్ కు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు…
డయాప్రం వాల్ ను పరిశీలించిన బృందం శుభవార్తను వినిపించారు..పోలవరం ప్రాజెక్టులో నిర్మించిన డయాఫ్రం వాల్‌పై వరద నీరు ప్రవహంచినంత మాత్రాన ఆ కట్టడానికి ఏమీ కాదని ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ జలవనరుల నిపుణులు తెలిపారు. నీళ్లలో కొంతకాలం ఉంటే దెబ్బతింటుందనే ఆలోచన సరికాదని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులో కీలక కట్టడమైన డయాఫ్రం వాల్ గోదావరి భారీ వరదలకు ధ్వంసం కాగా.. ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలా, పాతదానికే మరమ్మతులు చేసి, కొంతమేర కొత్తది నిర్మించి పాత కట్టడానికి అనుసంధానించాలా అని ఇంజినీర్లు అడగ్గా.. ప్రస్తుతం ఉన్న డయాఫ్రం వాల్‌ను మరమ్మతు చేసుకుంటే సరిపోతుంది కదా అని ఒక నిపుణుడు వ్యాఖ్యానించారు. ఈ డయాఫ్రం వాల్‌కు కొత్త కట్టడం జత చేస్తే ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అని మరికొందరు ప్రశ్నించగా అలాంటివేమీ ఉండవనీ స్పష్టం చేశారు. వరద వల్ల డయాప్రం వాల్ కు ఎటువంటి ప్రమాదం జరగలేదని, అయిదే ఇసుక, మట్టి ఆ ప్రాంతాన్ని కప్పేయడంతో డ్రయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని అనుమానాలు వ్యక్తమయ్యాయయని చెప్పారు.. డయాప్రం వాల్ కి ఇప్పటి వరకూ చిన్న డ్యామేజ్ కూడా జరగలేదంటూ , దీనిపై ఇంకా లోతైన అధ్యయనం చేస్తున్నామని చెప్పారు..
ఇది ఇలా ఉంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టు పనులపై ఆరా తీశారు.. ఇబ్బందులు, ప్రాజెక్టులో లోపాలు.. తదితర అంశాలపై దృష్టిపెట్టారు.. ఆ తర్వాత విదేశీ నిపుణులను రంగంలోకి దింపి వారి సలహాలు,సూచనలతో ఇక ముందు నిర్మాణాలు చేపట్లనున్నారు..