ఆంధ్రప్రభ స్మార్ట్, ఎన్టీఆర్ జిల్లా బ్యూరో : విజయవాడలోని వరద బాధితులకు నిత్యావసర సరకుల పంపిణీ చేసే వాహనాలను శుక్రవారం ఉదయం మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెంనాయుడు, కందుల దుర్గేష్, ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించారు. ఆపై బాధితులకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. 1200 వాహనాల్లో ప్రతీ ఇంటికి సరుకులు అందేలా ప్లాన్ చేశామని చెప్పారు. రేపు పండుగ అయినా పంపిణీ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. నాలుగు రోజుల్లో అందరికీ సరుకులు అందేలా చేస్తామన్నారు. నీళ్లు ఉన్న ప్రాంతాల్లో తోపుడు బళ్ల ద్వారా సరుకులు లోపలకు తీసుకెళతామని మంత్రి నాదెండ్ల చెప్పారు.
అనంతరం ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ఇంతటి విపత్తులో బాధితులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. చంద్రబాబు ఈ వయసులోనూ ప్రజల కోసం ఎంతో శ్రమిస్తున్నారని, బాధితులకు అన్ని విధాలా సహాయక చర్యలు అందేలా ఆదేశాలు ఇస్తున్నారని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీల్లో పరిస్థితి పర్యవేక్షించి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యే లు, అధికారులు ముంపు ప్రాంతాల్లో తిరుగుతున్నారని తెలిపారు. ప్రతిరోజూ ఆహారం, నీరు, బ్రెడ్, పాలు రెండు మూటలా అందిస్తున్నారన్నారు. ఇప్పుడు నిత్యావసర వస్తువులు నెల రోజుకు సరిపడా ఇస్తున్నారన్నారు.
ప్రతి ఇంటికి నిత్యావసర సరుకుల పంపిణీ 100 శాతం జరిగేలా మంత్రులు ఆదేశించారు. వరద బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార, 2 కిలోల ఉల్లిగడ్డలు, 2 కిలోల బంగాళాదుంపలు, లీటర్ పామాయిల్ పంపిణీ చేస్తున్నారు.