దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. గత మూడు రోజులుగా కరోనా కేసులు 3లక్షలకు పైగా నమోదవుతున్నాయి. కరోనా కేసులు అత్యధిక స్థాయిలో పెరుగుతుండడంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలు, నైట్ కర్ఫ్యూ వంటి చర్యలు చేపట్టాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. అయితే నైట్ కర్ఫ్యూను పోలీసులు మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నిన్న విడుదలైన రాష్ట్ర హెల్త్ బులిటెన్ ప్రకారం.. 13,212 మందికి కరోనా సోకినట్లు తేలింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2153268కి చేరింది. కోవిడ్‌తో విశాఖ జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14532కు చేరింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 64136 యాక్టివ్ కేసులున్నాయి.
మెడికల్ ఎమర్జెన్సీలు మినహా ఎవరైనా రాత్రి 11 గంటలు దాటిన తర్వాత రోడ్లపై కనబడితే తాట తీస్తున్నారు పోలీసులు, రాత్రిపూట ఫుడ్ కోర్టులను సైతం 10 గంటల్లోపే మూసివేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్ కోర్ట్ అనగానే రాత్రుళ్ళు నిత్యం రద్దీగా ఉండే బెజవాడ రోడ్లే గుర్తుకొస్తాయి. ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ కారణంగా బెజవాడలోని అన్ని ప్రధాన ఫుడ్ కోర్టులపై ఆంక్షలు పెట్టడంతో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. అయితే నైట్ కర్ఫ్యూతో ఫుడ్ కోర్టుల వారు ఆర్థికంగా నష్టోతున్నామని చెబుతున్నారు. కర్ఫ్యూ సమయంలో అనవసరంగా రోడ్ల మీదకు రావద్దని, అలా వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రజలు ఎవరైనా మాస్క్ లేకుండా బయట తిరిగినట్లయితే పోలీసులు కొరఢా ఝులిపిస్తున్నారు. భారీగా జరిమానా వసూలు చేస్తున్నారు. ఒక వైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు, పోలీసులు పదేపదే చెబుతున్నా.. కొందరు నిర్లక్ష్యం వహిస్తుండడంతో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..