ప్రభన్యూస్, ఎన్టీఆర్ బ్యూరో : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే అత్యంత ప్రసిద్ధి చెందిన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కొలువైన కనక దుర్గమ్మ ఆషాఢ మాస సంబురాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి జులై 6న ప్రారంభమైన ఆషాఢ మహోత్సవాలు ఈ ఆదివారంతో వైభవంగా ముగిశాయి. సుమారు నెలరోజులపాటు నిర్వహించిన ఈ మహోత్సవంలో కనకదుర్గమ్మ తల్లికి రాష్ట్రంలోని పలు దేవాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, భక్తులు పవిత్ర సారెను సాంప్రదాయ బద్ధంగా సమర్పించారు.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మొదలై..మొదటిరోజు ఆలయ వైదిక కమిటీ, ఆలయ పాలక సిబ్బంది ఆధ్వర్యంలో పవిత్ర సారెను సమర్పించగా, చివరి రోజు ఆదివారం ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావు దంపతులు సారెను సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై ఎంతో అట్టహాసంగా నిర్వహించిన ఈ మహోత్సవంలో మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు వేదమంత్రాల మధ్య ఊరేగింపుగా భక్తులు వచ్చి సారెను సమర్పించారు.
ఆషాడ ఉత్సవాల సందర్భంగా మహా మండపం ఆరవ అంతస్తులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై భక్తి శ్రద్ధలతో ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. పవిత్ర సారే లో భాగంగా పట్టు చీర, పసుపు, కుంకుమ, పూజా సామాగ్రి, పూలు, పండ్లు, వివిధ రకాల పిండివంటలను సమర్పించారు.