Tuesday, November 26, 2024

Andhra Pradesh -ఉద్యోగ సంఘం నేత సూర్య‌నారాయ‌ణ‌కు బిగుస్తున్న ఉచ్చు…

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల సంఘం (ఏపీ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌) అధ్యక్షుడు, వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగి కేఆర్‌ సూర్యనారా యణ చుట్టు ఉచ్చు బిగుసుకుంటోంది.. అవినీతి, ఆరోపణలతో పోలీసు, ఏసీబీ కేసులను ఎదుర్కొంటున్న ఆయన ముందస్తు బెయిల్‌ విషయంలో న్యాయ స్థానాల్లోనూ చుక్కెదురవుతోంది.. ఈ నేపథ్యంలో బేషరతుగా పోలీసులకు లొంగిపోతారనే ప్రచారం జరుగుతోంది. వాణిజ్య పన్నులశాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో కొందరు వ్యాపారులతో మిలాఖత్‌ అయి ప్రభుత్వానికి పన్నుల రూపేణ రావాల్సిన ఆదాయానికి గండికొట్టారనే అభియోగాలపై విజయవాడ పటమట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. అవినీతి, ఆరోపణలకు సంబంధించి ఏసీబీ కూడా మరో కేసు నమోదు చేసింది. ఈ పరిస్థితుల్లో పోలీసులు, అవినీతి ని రోధకశాఖ తదుపరి చర్యలు నిలుపుదల చేయాలంటూ ఉన్నత న్యాయస్థాంలో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని గురువారం హైకోర్టు త్రోసిపుచ్చింది. పటమట పోలీసు స్టేషన్‌లో సూర్యనారాయణతో పాటు మరో నలుగురు ఉద్యోగులపై కూడా కేసు నమోదైన సంగతి విదితమే.

హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. సూర్యనారాయణ తరపున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌, న్యాయవాది పీవీజీ ఉమేష్‌ చంద్ర వాదనలు వినిపించారు. ఈ కేసులో మిగిలిన నిందితులతో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉద్యోగుల సమస్యలపై ఉద్యమిస్తున్నందున కక్ష సాధింపు చర్యలతోనే కేసులు నమోదు చేస్తున్నారని ఆయన్ను అరెస్టు చేయటం ద్వారా ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. బెయిల్‌ రాకుండా చేసేందుకే అవినీతి అభియోగాలు మోపారన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. పోలీసుల తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపించారు. సూర్యనారాయణ ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వాదాయానికి గండికొట్టారని కోర్టు దృష్టికి తెచ్చారు.

వ్యాపారులతో కుమ్మక్కవటంతో పాటు నోటీసుల ప్రకారం వారు చెల్లించాల్సిన పన్నుల కంటే తక్కువ మొత్తాన్ని చూపటం ద్వారా అవినీతికి పాల్పడ్డారని ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలతో కేసు నమోదయింది. దీనికితోడు సూర్యనారాయణ తమకు ఏరకంగా సహకరించారో వ్యాపారులు వాంగ్మూలాలను కూడా పోలీసులు సేకరించారని సేకరించిన ఆధారాలను కోర్టుకు నివేదించారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయరాదని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి వ్యాపారుల వాంగ్మూలాలతో పాటు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందన ముందస్తు బెయిల్‌పై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటరు దాఖలుచేయాలని పోలీసులను ఆదేశించారు. కాగా ముందస్తు బెయిల్‌కు సంబంధించి విజయవాడ నాల్గవ అదనపు జిల్లా జడ్జి కోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌ను కూడా త్రోసిపుచ్చింది. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసును ఈ కోర్టు విచారణ జరపదని ఏసీబీ ప్రత్యేక కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు అదనపు పీపీ దుష్యంతరెడ్డి వాదనలతో ఏకీభవిస్తూ అదనపు జిల్లా జడ్జి కోర్టు పిటిషన్‌ను కొట్టేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement